హిల్లరీ బంధువు అరెస్ట్‌


వాషింగ్టన్‌: డెమోక్రటిక్‌ పార్టీ నుంచి అమెరికా అధ్యక్ష పదవికి పోటీ చేయనున్న హిల్లరీ క్లింటన్‌ మరిది(బిల్‌క్లింటన్‌ సవతి సోదరుడు) రోగర్‌ క్లింటన్‌(59)ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. మద్యం సేవించి కారు నడుపుతున్నారని ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు అక్కడి మీడియా వెల్లడించింది. రోగర్‌ను అరెస్ట్‌ చేసి రెడాండో బీచ్‌ జైల్లో పెట్టారు. తర్వాత రోగర్‌ 15వేల డాలర్లు(సుమారు రూ.10లక్షలు) పూచీకత్తు మీద బెయిల్‌పై విడుదలయినట్లు సమాచారం. సెప్టెంబరు 2వ తేదీన ఆయన కోర్టు ఎదుట హాజరుకావాల్సి ఉంది. ఓ వ్యక్తి అడ్డదిడ్డంగా కారు నడుపుతున్నాడని రెడాండో బీచ్‌ పోలీసులకు ఫోన్‌ రావడంతో వారు అతడిని అరెస్ట్‌ చేశారు. జైల్లో కెమికల్‌ పరీక్షలకు కూడా రోగర్‌ అంగీకరించలేదని పోలీసులు వెల్లడించారు.

రోగర్‌కి నేరచరిత్ర ఉంది. 2001లో కూడా ఇలాగే మద్యం సేవించి డ్రైవింగ్‌ చేసిన కేసులోనే అరెస్టయ్యారు. అంతకుముందు 1980ల్లో డ్రగ్స్‌కు సంబంధించిన కేసులో జైలుకు వెళ్లారు. బిల్‌ క్లింటన్‌ అమెరికా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో రోగర్‌ విడుదలయ్యారు. తాజాగా మళ్లీ రోగర్‌ అరెస్టవడంతో అధ్యక్ష పదవికి రేసులో ఉన్న హిల్లరీకి ఇబ్బందిగా మారింది.