హుజారాబాద్‌కు బయలుదేరిన టిఆర్‌ఎస్‌ శ్రేణులు

నిర్మల్‌లో బస్సుకు జెండా ఊపిన మంత్రి
హైదరాబాద్‌,ఆగస్ట్‌16(జనంసాక్షి): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన దళిత బంధు పథకాన్ని సీఎం కేసీఆర్‌ హుజూరాబాద్‌లో ప్రారంభించనున్న నేపథ్యంలో పలు జిల్లాల నుంచి టిఆర్‌ఎస్‌ కార్యకర్తలు
హుజూరాబాద్‌కు బయలుదేరారు. నిర్మల్‌ నుంచి టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు, నాయకులు, దళిత సోదరులు ప్రత్యేక బస్సులో తరలి వస్తున్నారు. ఈ బస్సు యాత్రను నిర్మల్‌లో మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి ప్రారంభించారు. అదేవిధంగా వికారాబాద్‌ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్‌ ఆధ్వర్యంలో దళిత సోదరులు హుజూరాబాద్‌కు బయలుదేరారు. మంత్రి మల్లా రెడ్డి భారీ కాన్వాయ్‌తో సభాస్థలికి పయణమయ్యారు. మేడ్చల్‌ నియోజకవర్గం నుంచి 500 వాహనాల్లో హుజూరాబాద్‌కు వెళ్తున్నారు. మునుగోడు నియోజకర్గం నుంచి భారీగా దళితులు హుజూరాబాద్‌ సభకు బయల్దేరారు. మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌ రెడ్డి వాహనాలకు జెండా ఊపి ప్రారంభించారు. హుజూరాబాద్‌ నియోజకవర్గంలోని శాలపల్లి ఇందిరానగర్‌లో దళితబంధు కార్యక్రమాన్ని సీఎం కేసీఆర్‌ ప్రారంభిస్తారు. 15 మంది లబ్దిదారులకు దళితబంధు మూజూరు పత్రాలు పంపిణీ చేస్తారు. సభకు సంబంధించిన ఏర్పాట్లను అధికారులు ఇప్పటికే పూర్తిచేశారు.