హుస్నాబాద్‌లో 7న ఆశీర్వాద సభ
సిఎం కెసిఆర్ పాల్గొనే తొలి సభ
ఏర్పాట్లను పరిశీలించిన మంత్రులు
సిద్దిపేట,సెప్టెంబర్4(జనం సాక్షి): ముందస్తు ఎన్నికల నేపథ్యంలో టిఆర్‌ఎస్ వేంగగా దూసుకుని పోతోంది. కొంగర కలాన్ సభ తరవాత ఇప్పుడు మరో వంద సభలకు ప్లాన్ చేస్తున్న సందర్భంలో తొలిసభను హుస్నాబాద్‌లో ఏర్పాటు చేస్తున్నారు. సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరుగనున్న బహిరంగ సభ పేరు ప్రజల ఆశీర్వాద సభ అని మంత్రి హరీశ్ రావు అన్నారు. ఈ నెల 7న సీఎం కేసీఆర్ హుస్నాబాద్ పర్యటనపై మంత్రులు హరీశ్ రావు, ఈటల రాజేందర్ సవిూక్ష నిర్వహించారు. హుస్నాబాద్ లో బహిరంగసభ ఏర్పాట్లు, సభాస్థలిని మంత్రులు హరీశ్ రావు, ఈటల, ఎంపీ వినోద్, ఎమ్మెల్యే సతీశ్ లతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ..50 రోజుల్లో వంద బహిరంగసభలు నిర్వహించనున్నట్లు చెప్పారు. నాలుగేళ్లలో చేసిన అభివృద్ధిని ప్రజలకు తెలియజేయడమే ప్రధాన ఉద్దేశమని ఆయన పునరుద్ఘాటించారు. ఈ సందర్భంగా ఈటెల మాట్లాడుతూ.. 50 రోజుల్లో 100 నియోజకవర్గాల్లో కెసిఆర్ పర్యటించనున్నారని తెలిపారు. హుస్నాబాద్ సభ జనసవిూకరణపై కార్యకర్తలతో చర్చించారు. పండితుల సూచన మేరకు శ్రావణ మాసంలో బహిరంగ సభ ప్రారంభించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించినట్లు సమాచారం. రాష్ట్రంలోని ఈశాన్య ప్రాంతమైన హుస్నాబాద్‌ను తొలి సభకు ఎంపిక చేశారు. ఆర్టీసీ బస్సు డిపో పక్కన మైదానాన్ని బహిరంగసభ కోసం ఖరారు చేశారు. మంత్రుల వెంట పలువురు ప్రజాప్రతినిధులున్నారు.



