హుస్నాబాద్ లో ఎగిరేది కాషాయ జెండా

150 మంది బిజెపిలో చేరిక

* వెల్డన్ బొమ్మ శ్రీరామ్

* బిజెపి స్టేట్ చీఫ్ బండి సంజయ్

కరీంనగర్ బ్యూరో ( జనం సాక్షి ) :
బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ పార్లమెంటు సభ్యుడు బండి సంజయ్ కుమార్ సమక్షంలో బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి ఆధ్వర్యంలో హుస్నాబాద్ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్, టిఆర్ఎస్ పార్టీలకు చెందిన దాదాపు 150 మంది శుక్రవారం కరీంనగర్ లోని ఎంపి కార్యాలయం లో కాషాయతీర్థం పుచ్చుకున్నారు. హుస్నాబాద్ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్, టిఆర్ఎస్ నాయకులు, తాజా, మాజీ ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు బండి సంజయ్ కుమార్ సమక్షంలో కరీంనగర్లో చేరారు. కాంగ్రెస్, టిఆర్ఎస్ పార్టీలో వివిధ హోదాల్లో పనిచేసిన ముఖ్యులు బిజెపిలో చేరిన వారిలో ఉన్నారు. ఇందులో కాంగ్రెస్ అధ్యక్షులు కోరంటి సత్యనారాయణ, కౌన్సిలర్ కోమటి స్వర్ణలత, మాజీ సర్పంచ్ ,జిల్లా ఉపాధ్యక్షులు వంగర మల్లేశం, హుస్నాబాద్ పట్టణ అధ్యక్షులు అక్కు శ్రీనివాస్, సైదాపూర్ బీసీ సెల్ అధ్యక్షులు సంతోష్, నియోజకవర్గ యూత్ ఉపాధ్యక్షులు ఈసంపల్లి శ్రీకాంత్, భీమదేవరపల్లి మండల జనరల్ సెక్రెటరీ రూపేష్, ఎల్కతుర్తి బీసీ సెల్ ఉపాధ్యక్షులు శ్రీపతి మధుకర్ గౌడ్, సైదాపూర్ మండల యూత్ ప్రెసిడెంట్ రాహుల్, కోహెడ మండల కార్యదర్శి గాజుల వెంకటేశ్వర్లు, భీమ్ దేవరపల్లి మేస్త్రి సంఘం ప్రధాన కార్యదర్శి రాజు, మాజీ సర్పంచ్ ప్రభాకర్ , కోహెడ మండలం కూరెళ్ల గ్రామం నుంచి ఐదుగురు వార్డ్ మెంబర్లు, దాదాపు 150 మందికి పైగా బిజెపిలో రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ సమక్షంలో చేరారు. ఈ సందర్భంగా బిజెపి రాష్ట్ర అధ్యక్షులు, కరీంనగర్ పార్లమెంటు సభ్యులు బండి సంజయ్ కుమార్ కండువాలు వేసి పార్టీలోకి వీరందరినీ సాదరంగా ఆహ్వానించారు.
ఈ సందర్భంగా బండి మాట్లాడుతూ వెల్డన్ బొమ్మ శ్రీరామ్ అంటూ ఆయనను అభినందించారు హుస్నాబాద్ నియోజకవర్గంలో కాషాయ జెండా ఎగరవేసేలా తగిన కార్యచరణతో ముందు సాగాలని పార్టీలో చేరిన నాయకులకు సూచించారు. తెలంగాణలో ప్రత్యామ్నాయ శక్తిగా మారిన బిజెపి వైపు ప్రజలు చూస్తున్నారని, బిజెపి నాయకత్వంపై ప్రజలకు నమ్మకం ఉందని, ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా కష్టపడి పార్టీని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లడానికి కృషి చేయాలన్నారు. హుస్నాబాద్ నియోజకవర్గంలో బిజెపి బలంగా ఉందని, కలిసికట్టుగా బిజెపి గెలుపు కోసం ప్రతి ఒక్కరూ కృషి చేస్తే, రాబోయే రోజుల్లో హుస్నాబాద్ నియోజకవర్గాన్ని బిజెపి కైవసం చేసుకుంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో సిద్దిపేట జిల్లా అధ్యక్షులు దూది శ్రీకాంత్ రెడ్డి, బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రామ్ గోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.