హెచ్‌ఎండీఏకు కాసుల వర్షం !
హైదరాబాద్ : మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఎ) దశ తిరుగుతోంది. ఇంతకాలం ఆర్థికంగా ఒడిదుడుకుల్లో ఉన్న సంస్థ మెల్లి మెల్లిగా కోలుకుంటోంది. లే అవుట్, బిల్డింగ్ అనుమతులు, ఎల్‌ఆర్‌ఎస్, ప్రాసెసింగ్ చార్జీలు, భూవినియోగ ధ్రువీకరణ, మార్పిడి, నిరభ్యంతర ధ్రువీకరణ, పార్కులు, కమర్షియల్ భవనాల అద్దె రూపంలో సంస్థకు ఆదాయం వస్తోంది. ఈ నేపథ్యంలోనే ఎల్‌ఆర్‌ఎస్, బిల్డింగ్, లేఅవుట్, ప్రాసెసింగ్ ఛార్జీల్లో ఇటీవల చేపట్టిన సంస్కరణలు మంచి సత్ఫతాలినిస్తున్నాయి. మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఎ)కు మళ్లీ మంచి రోజులు వస్తున్నాయి. ఉద్యోగుల జీతభత్యాల చెల్లింపులు, ప్రాజెక్టుల వడ్డీల భారం నుంచి కోలుకుంటోంది. ప్రధానంగా నిర్మాణ రంగాన్ని మరింత ప్రోత్సహించి, తద్వారా సంస్థ ఆదాయాన్ని మెరుగుపర్చుకోవడమే లక్ష్యంగా లే అవుట్‌లు, భవన నిర్మాణాల అభివృద్ధి, క్యాపిటలైజేషన్ రుసుం చెల్లింపులో ఒకేసారి చెల్లింపు విధానం నుంచి వెసులు కల్పిస్తూ వాయిదాల పద్ధతిని ప్రవేశపెట్టారు. రూ.15లక్షల కంటే ఎక్కువ ఉన్న దరఖాస్తులకు ఈ వాయిదాల పద్ధతిని వర్తింపజేయడంతో ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు ముందుకు వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే నిర్మాణదారుల దరఖాస్తుల నుంచి సంస్థకు రూ. 40కోట్ల మేర ఆదాయం వస్తుందన్న అధికారుల అంచనాకు తగ్గట్లుగానే వాయిదా పద్థతికి అనూహ్య స్పందన వచ్చింది. దీంతో పాటే సంస్థకు సంబంధించి స్వర్ణజయంతి, మైత్రీవనం, మైత్రీ విహార్‌తో పాటు మరో రెండు చోట్ల నుంచి అద్దె వసూలును పెంచడం, ఎన్టీఆర్, లుంబినీ పార్కుల నుంచి మెరుగైన ఆదాయాన్ని రాబడుతోంది.