హెలికాప్టర్ల ఒప్పందంపై చర్చకు సిద్ధం : ప్రధాని


న్యూఢిల్లీ, ఫిబ్రవరి 18 (జనంసాక్షి ):
హెలికాప్టర్ల కుంభకోణంపై ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌ తొలిసారిగా స్పందించారు. వీవీఐపీల హెలికాప్టర్ల ఒప్పందంలో ప్రభుత్వం దాచడానికి ఏవిూ లేదని స్పష్టం చేశారు. అన్ని అంశాలపై చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. సోమవారం ప్రధాని మన్మోహన్‌ విలేకరులతో మాట్లాడారు. ‘దాచడానికి ఏవిూ లేదు. పార్లమెంట్‌లో అన్ని అంశాలపై చర్చించేందుకు మేం సిద్దం’ అని అన్నారు. హెలికాప్టర్ల కుంభకోణంపై పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలను స్తంభింపజేస్తామన్న విపక్షాల హెచ్చరికలను ప్రస్తావించగా.. అన్ని అంశాలపై తాము చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని బదులిచ్చారు. ‘మేమేప్పుడు చర్చకు సిద్ధమే. చర్చలకు ఇంకా ఆస్కారం ఉంది’ అని తెలిపారు.భారత్‌తో అగస్టా వెస్ట్‌ల్యాండ్‌
హెలికాప్టర్ల కొనుగోలు ఒప్పందం సందర్భంగా భారీగా ముడుపులు ముట్టాయని ఇటలీ దర్యాప్తు అధికారులు తేల్చారు. రూ.3,600 కోట్ల ఒప్పందంలో రూ.360 కోట్లు లంచాలు ఇచ్చినట్లు వెలుగు చూసింది. ఈ కుంభకోణంలో ఉన్నతాధికారుల ప్రమేయం ఉన్నట్లు పలు పేర్లు వెలుగులోకి వచ్చాయి. దీంతో ఈ అంశంపై దేశవ్యాప్తంగా తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. విపక్షాలు ప్రభుత్వంపై తీవ్ర స్తాయిలో మండిపడ్డాయి. ఆత్మరక్షణలో పడిన యూపీఏ సర్కారు సీబీఐ దర్యాప్తుకు ఆదేశించడంతో పాటు.. ఇటలీ సంస్థ ఫిన్‌మెకానికాతో ఒప్పందాన్ని రద్దు చేసింది. మరోవైపు సీబీఐ దర్యాప్తు ప్రారంభించింది. అయితే, న్యాయ విచారణ జరిపించాలని, లేదంటే పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీతో దర్యాప్తు చేపట్టాలని బీజేపీ ఒత్తిడి తెస్తోంది. లేకుంటే పార్లమెంట్‌ సమావేశాలను స్తంభింపజేస్తామని హెచ్చరిస్తోంది. దీనిపై ప్రధాని తొలిసారిగా స్పందిస్తూ.. అన్ని అంశాలపై చర్చకు సిద్ధమని ప్రకటించారు.