హైకోర్టును ఆశ్రయించిన ప్రభాస్‌

– రాయదుర్గం సవిూపంలో గెస్ట్‌ హౌస్‌ను సీజ్‌ చేయడంపై పిటీషన్‌ దాఖలు
హైదరాబాద్‌, డిసెంబర్‌19(జ‌నంసాక్షి) : రాయదుర్గం సవిూపంలోని గెస్ట్‌ హౌస్‌ను అధికారులు సీజ్‌ చేయడంతో.. సినీ హీరో ప్రభాస్‌ బుధవారం హైకోర్టును ఆశ్రయించారు. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్‌ నగర శివారు రాయదుర్గం సవిూపంలోని ‘పైగా’భూముల్లో అక్రమ నిర్మాణాలను రెవెన్యూ అధికారులు సోమవారం కూల్చివేసిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా సినీ నటుడు ప్రభాస్‌ గెస్ట్‌హౌస్‌ను అధికారులు సీజ్‌ చేశారు. దీనిపై స్పందించిన ప్రభాస్‌, హైకోర్టును ఆశ్రయించారు. తనకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే గెస్ట్‌హౌస్‌ను అధికారులు సీజ్‌ చేశారని ప్రభాస్‌ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఆయన తరఫు లాయర్‌ ఈ మేరకు పిటిషన్‌ దాఖులు చేశారు. ఈ వ్యాజ్యంపై నేడు విచారణ జరిగే అవకాశం ఉంది. రాయదుర్గం పైగా భూముల్లోని సర్వే నంబరు 46లో 84.30 ఎకరాల స్థలం ఉంది. ఈ స్థలంపై ప్రభుత్వం, స్థానిక వ్యక్తుల మధ్య 1954 నుంచి వివాదం కొనసాగుతోంది. ఇది హైకోర్టు దాకా వెళ్లడంతో మూడునెలల కిందట ఆ భూమి ప్రభుత్వానిదేనని న్యాయస్థానం తీర్పు వెలువరించింది. ఇక్కడ గతంలోనే పశువుల పాకలు, ఇతర నిర్మాణాలు చేపట్టారు. ఆ ప్రాంతంలోనే నే ప్రభాస్‌ గెస్ట్‌హౌస్‌ కూడా ఉంది. కోర్టు తీర్పు వెలువరించినా ఎన్నికల నేపథ్యంలో అధికారులు కొన్నాళ్లు ఆక్రమణల తొలగింపు చర్యలు చేపట్టలేదు. సోమవారం శేరిలింగంపల్లి తహసీల్దార్‌ వాసుచంద్ర, సిబ్బంది ఆ స్థలంలోని పాకలు, ప్రహరీ గోడలను జేసీబీల సాయంతో కూల్చివేశారు. ప్రభాస్‌కు సంబంధించిన గెస్ట్‌హౌస్‌ దగ్గర ఎవరూ అందుబాటులో లేకపోవడంతో గేటుకు నోటీసు అంటించి తాళంవేసి సీజ్‌ చేశారు. ప్రభుత్వ స్థలమని పేర్కొంటూ అక్కడ నోటు ఏర్పాటుచేశారు. ఈ నేపథ్యంలో ప్రభాస్‌ హైకోర్టును ఆశ్రయించారు.