హైదరాబాద్‌లో ఓప్పో 5జీ ఇన్నోవేషన్‌ ల్యాబ్‌

హైదరాబాద్‌,డిసెంబరు 22 (జనంసాక్షి):తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడుల పెట్టేందుకు పలు పముఖ కంపెనీలు ముందు వస్తున్నాయి. ఇప్పటికే ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన అమెజాన్‌, గూగుల్‌, ఫేస్‌బుక్‌, ఆపిల్‌ వంటి సంస్థలతో పాటు ఫియట్‌ క్రిస్లర్‌ సంస్థ కూడా పెట్టుబడులు పెడుతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.తాజాగా హైదరాబాద్‌కు మరో భారీ పెట్టుబడి వస్తున్నట్లు ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ ట్విట్టర్‌ వేదికగా ప్రకటించారు. హైదరాబాద్‌కు ఒప్పో 5జీ ఇన్నోవేషన్‌ ల్యాబ్‌ వస్తుందని తెలిపారు. ఇది దేశంలోనే మొదటి 5జీ ఇన్నోవేషన్‌ ల్యాబ్‌ అని పేర్కొన్నారు. పెట్టుబడులకు హైదరాబాద్‌ సానుకూలమని మరోసారి నిరూపితమైందని మంత్రి కేటీఆర్‌ పేర్కొన్నారు.కాగా ప్రముఖ స్మార్ట్‌ ఫోన్‌ తయారీ సంస్థ ఓప్పో హైదరాబాద్‌లో తన 5జీ ఇన్నోవేషన్‌ ల్యాబ్‌ను ఏర్పాటు చేసినట్లు మంగళవారం ప్రకటించింది. చైనా బయట ఏర్పాటు చేసిన మొదటి ల్యాబ్‌ ఇదేనని వారు వెల్లడించారు. చైనా 5జీ సేవలను భారత్‌కు తీసుకొచ్చే ప్రయత్నాన్ని వేగవంతం చేసింది. ఇటీవల జరిగిన ఇండియా మొబైల్‌ కాంగ్రెస్‌ సమావేశంలో రిలయన్స్‌ జియో భారతదేశంలో మొదటిసారిగా 5జీను తీసుకురానున్నట్లు ప్రకటించింది. ”చైనాకు వెలుపల ప్రారంభించిన మొదటి ఇన్నోవేషన్‌ ల్యాబ్‌ ఇదే. ఈ ల్యాబ్‌ సహకారంతో 5జీ కోర్‌ టెక్నాలజీను అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నాం. భారత్‌లో 5జీ టెక్నాలజీను విస్తరించేందుకు మేం సహకారం అందిస్తాం.” అని ఓప్పో ఇండియా వైస్‌ ప్రెసిడెంట్‌ తస్లీమ్‌ ఆరిఫ్‌ ఒక ప్రకటనలో తెలిపారు. కెమేరా, పవర్‌ అండ్‌ బ్యాటరీ, పర్ఫామెన్స్‌ వంటి వాటి పరిశోధన, అభివృద్ది వంటి వాటికోసం ప్రత్యేక ల్యాబ్‌లు హైదరాబాద్‌లో ఏర్పాటు చేయాలని యోచిస్తున్నట్లు వారు తెలిపారు. భారత్‌ను ఇన్నోవేషన్‌ హబ్‌గా మారుస్తామన్న తమ మాటను నిలబెట్టుకుంటామన్నారు. భారత్‌లోని హైదరాబాద్‌లో ఉన్న ఈ ల్యాబ్‌ మిడిల్‌ ఈస్ట్‌, ఆఫ్రికా, సౌత్‌ ఆసియా, జపాన్‌, యూరప్‌ మార్కెట్ల ఇన్నోవేషన్‌, పరిశోధన, అభివృద్ధి బాధ్యతలను తీసుకుంటుందని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. 5 జీ భారతదేశానికి 2021 మధ్య వస్తుందని అంచనా వేస్తున్నారు. రిలయన్స్‌ జియో అధినేత అంబానీ వచ్చే ఏడాది 5జీ కి సంబంధించిన కార్యక్రమాలను ప్రారంభిస్తామని ప్రకటించారు. మరోవైపు స్మార్ట్‌ఫోన్‌ బ్రాండ్‌ రియల్‌విూ భారత్‌లో తన 5జీ ఫోన్‌ను ప్రకటించిన మొదటి కంపెనీగా నిలిచింది. తరువాత ఓప్పో తన ఫైండ్‌ ఎక్స్‌2 5జి ఫోన్‌ను విడుదల చేసింది.