హైదరాబాద్‌లో జోరుమీదున్న రియల్ ఎస్టేట్ వ్యాపారం

6హైదరాబాద్ రియల్ ఎస్టేట్ వ్యాపారం గణనీయంగా పుంజుకొన్నది. రాష్ట్ర అవిర్భావం అనంతరం హైదరాబాద్‌లో ఇండ్లు, ఫ్లాట్ల అమ్మకాలు గణనీయంగా పెరిగాయి. నగరంలో ఇండ్లు, ఫ్లాట్ల అమ్మకాలపై ప్రముఖ గృహ నిర్మాణ కన్సల్టెన్సీ సంస్థ జేఎల్‌ఎల్ ఇండియా అధ్యయనం చేసింది. 2014 అక్ట్టోబర్ నుంచి 2015 సెప్టెంబర్ వరకు జరిపిన ఈ అధ్యయనంలో 67 శాతం అమ్మకాలు పెరిగినట్లుగా పేర్కొన్నది.

ఈ సంవత్సర కాలంలో 7వేల ఇండ్లు, ఫ్లాట్లు అమ్ముడుపోగా అంతకుముందు సంవత్సరంలో కేవలం 4200 ఇండ్లు మాత్రమే అమ్ముడుపోయినట్లు తెలిపింది. తెలంగాణ రాష్ట్ర అవిర్భావం తర్వాత రాజకీయంగా అస్పష్టత తొలగడం, రెండు రాష్టాలకు ఉమ్మడి రాజధానిగా ఉండటం, దేశవిదేశాలనుంచి భారీగా పెట్టుబడులు వస్తుండటంతో కొనుగోలుదారులు కూడా అసక్తి కనబర్చారని జేఎల్‌ఎల్ ఇండియా సంస్థ జాతీయ డైరెక్టర్ తెలిపారు. ఆరు నెలలుగా గ్రేటర్‌లో వర్తక, వ్యాపార కార్యకలాపాలు భారీగా వృద్ధి చెందాయని, సానుకూలమైన రాజకీయ సుస్థిర వాతావరణం కూడా ఇందుకు దోహదపడిందన్నారు.

గత తొమ్మిది నెలలుగా విక్రయాలు గణనీయంగా వృద్ధి చెందాయని.. గతంతో పోల్చితే 1.5 రేట్లు పెరిగాయని గుర్తించినట్లు అశుతోష్ చెప్పారు. రాబోయే రోజుల్లో ఇండ్లు, ఫ్లాట్ల ధరలు పెరిగే అవకాశాలు లేకపోలేదన్నారు. నగరంలో మంచి వాతావరణం, మౌలిక సదుపాయాలు ఉండటమే దీనికి కారణంగా భావిస్తున్నామని తెలిపారు. రాష్ట్ర ఏర్పాటుతో రాజకీయంగా సుస్థిరమైన ప్రభుత్వం ఏర్పడటం, ఆ తర్వాత దేశంలోనే ఉత్తమ పారిశ్రామిక పాలసీని తీసుకురావడంతో పెట్టుబడులు పెట్టడానికి పారిశ్రామిక, వ్యాపార వర్గాలు ఇక్కడికి వస్తున్నాయని ఆ సంస్థ పేర్కొన్నది. ఇండ్లు, ఫ్లాట్లతోపాటుగా కార్యాలయాలకు అవసరమైన స్థలానికి డిమాండ్ పెరిగిందని సంస్థ వెల్లడించింది. రాబోయే రోజుల్లో మాల్స్‌ కు అవసరమైన స్థలానికి డిమాండ్ పెరుగుతుందని, 2014లో 2లక్షల మిలియన్ల చదరపు అడుగుల స్థలం అవసరం ఉండగా.. తాజాగా ఐదు లక్షల చదరపు అడుగులకు చేరిందని పేర్కొన్నది. 2022 నాటికి 8 నుంచి 10 మిలియన్ చదరపు అడుగుల స్థలం మాల్స్‌ కు అవసరం ఏర్పడుతుందని అంచనా వేసింది. త్వరలో మెట్రో రైలు సర్వీసులు ప్రారంభం కావడం, భవిష్యత్‌లో ఎంఎంటీఎస్ ఫేజ్ -2 ప్రారంభమయ్యే అవకాశాలు ఉండటం, ఔటర్ రింగ్ రోడ్ పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానుండటంతో హైదరాబాద్ నగరంపై మక్కువ చూపుతున్నారని ఆ సంస్థ తేల్చింది.

ఇతర నగరాలతో పోల్చితే హైదరాబాదే బెస్ట్‌ అని తేల్చింది. ముఖ్యంగా చెన్నై, పుణెలకన్నా తక్కువ జీవనవ్యయం ఉండటం.. నాణ్యమైన జీవనంలో మూడో ఆదర్శ నివాసయోగ్య నగరంగా ఉందని సంస్థ అధ్యయనంలో తేలింది. ఈ-గవర్నెన్స్ అమలులో ఉన్న నగరం కావడంతో పాటు గ్రేటర్‌లో నిర్మాణాలకు ఆన్‌లైన్ అనుమతులు ఇవ్వడం కూడా ఇందుకో కారణంగా చెప్పింది. ఐఐటీ, ఐఎస్‌బీ, బిట్స్ ఉన్నందున అందుబాటులో ప్రతిభాశీల మానవ వనరులు ఉన్నాయని తెలిపింది. అటు ఓఆర్‌ఆర్, అంతర్జాతీయ విమానాశ్రయం, ఇన్నర్ రింగ్‌రోడ్లు, మెట్రో, ఎక్స్‌ ప్రెస్ హైవేలు హైదరాబాద్‌ కు అడ్వంటేజ్‌గా ఉన్నాయని జేఎల్‌ఎల్‌ సర్వే తెలింది.