హైదరాబాద్ నుంచి ఎత్తివేత: గుంటూరుకు జగన్ ఆఫీస్ షిఫ్ట్
హైదరాబాద్: వైయస్ జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ప్రధాన కార్యాలయాన్ని గుంటూరుకు మార్చాలని ఆ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి నిర్ణయించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటి వరకు పార్టీ ప్రధాన కార్యాలయంలో హైదరాబాదులో ఉంది. తెలంగాణలో పార్టీ నామమాత్రం కావడంతో జగన్ పూర్తిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తన రాజకీయాలకు కేంద్రంగా మార్చుకోవాలని భావిస్తున్నారు. అందుకే ప్రధాన కార్యాలయాన్ని గుంటూరుకు మార్చాలని అనుకుంటున్నట్లు చెబుతున్నారు. ఈ మేరకు బుధవారంనాడు మీడియాలో వార్తలు వచ్చాయి. గుంటూరు కేంద్రంగా ఏపీలో పార్టీ కార్యకలాపాలు నిర్వహించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. రాష్ట్రంలోని ప్రజలు, కార్యకర్తలు తమ సమస్యలను వివరించేందుకు హైదరాబాద్కు రావాలంటే తీవ్ర ఇబ్బందుకు ఎదుర్కోవాల్సి వస్తోందని, ఈ నేపథ్యంలోనే ప్రజలకు, కార్యకర్తలకు అందుబాటులో ఉండేందుకు వీలుగా పార్టీ కార్యలయాన్ని గుంటూరులో నిర్మించాలని జగన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ నుంచి ఎత్తివేత: గుంటూరుకు జగన్ ఆఫీస్ షిఫ్ట్ ఈ క్రమంలోనే గుంటూరులో పార్టీ ఆఫీసు స్థాపన కోసం చర్యలు తీసుకోవాల్సిందిగా జిల్లా నేతలను జగన్ ఆదేశించినట్లు సమాచారం. మరోవైపు కార్యాలయం ఏర్పాటు ప్రక్రియ నాలుగు నెలల్లోనే పూర్తిచేయాలని గడువు పెట్టారు. రానున్న జూన్ నెల నుంచి గుంటూరు కేంద్రంగా పార్టీని నడపాలని జగన్ నిర్ణయించుకున్నారు. అప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ రాజధాని విజయవాడకు తరలుతుంది. రాజధాని అక్కడికి మారేలోగా తన కార్యకలాపాలకు గుంటూరును కేంద్రంగా మార్చుకోవాలని ఆయన అనుకుంటున్నారు. జగన్ మొదట పార్టీ కార్యాలయాన్ని విజయవాడలో ఏర్పాటు చేయాలని భావించారు. అయితే ఏపీ నూతన రాజధాని ప్రకటన అనంతరం ఆ నిర్ణయాన్ని మార్చుకున్నారు. వారంలో నాలుగు రోజులు గుంటూరులోనే ఉంటూ ప్రజలు, కార్యకర్తలకు అందుబాటులో ఉండాలని జగన్ భావిస్తున్నారు. దీనివల్ల ప్రతిపక్షనేత తమకు అందుబాటులో ఉన్నారన్న అభిప్రాయం ప్రజలతో పాటు, పార్టీ క్యాడర్లోనే కలుగుతుందని ఆయన అంచనా వేస్తున్నారు. అవసరాన్ని బట్టి జిల్లాల్లోనూ విస్తృతంగా పర్యటించాని జగన్ భావిస్తున్నారని సమాచారం.