హైదరాబాద్‌ వేదికగా నేటినుంచి సిపిఎం జాతీయ మహాసభలు

తాజా రాజకీయ పరిమాణాలపై లోతుగా విశ్లేషించనున్న లెఫ్ట్‌ నేతలు
మహాసభలతో ఎరుపెక్కిన భాగ్యనరగం
హైదరాబాద్‌,ఏప్రిల్‌17(జ‌నంసాక్షి):హైదరాబాద్‌లో ఈనెల 18 నుంచి 22వరకు సిపిఎం అఖిల భారత మహాసభలు జరుగనున్నాయి. దీంతో నగరంలో ఎర్రజెండాలు రెపరెపలాడుతున్నాయి.  ఏర్పాట్లను పొలిట్‌బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు, రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తదితరులు పరిశీలించారు. బాగ్‌లింగంపల్లి ఆర్టీసీ కల్యాణమండపం వేదికగా మహాసభలు జరుగనున్నాయి. మారిన పరిస్థితులు,
రాజకీయ పరిణామాల నేపథ్యంలో సిపిఎం మహాసభలకు ప్రత్యేకత ఉంది.  ప్రధానంగా సభాప్రాంగణం, డెలిగేట్లు, ఇతరులకు సీట్ల కేటాయింపు, మెయిన్‌ గేట్‌ అలంకరణ పనులు, వంటగదులు, వేదికను పరిశీలించారు. భవనం ముందు ప్రాంతంలోని ప్రధాన ప్రవేశ ద్వారం వద్ద ఎడమవైపు మార్క్స్‌, ఎంగెల్స్‌, లెనిన్‌, స్టాలిన్‌ బొమ్మలను ఏర్పాటు చేశారు.  కుడివైపు పార్టీ దివంగత నేత పుచ్చలపల్లి సుందరయ్య సైకిల్‌తో నిల్చున్న పోటోతో కూడిన భారీ ఛాయాచిత్రం ప్రధాన ఆకర్షణగా నిలిచింది. సభలు జరిగే ఆర్టీసి కల్యాణ మండపం పట్టుప్రక్కల ప్రాంతాల్లో ఎర్ర జండాలు స్వాగతం పలుకుతున్నాయి. నగర వ్యాప్తంగా స్వాగత తోరణాలు, భారీ ఫ్లెక్సీలు ఏర్పాటుచేశారు. తాజా రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో హైదరాబాద్‌లో జరుగుతున్న అఖిలభారత మహాసభలకు ఎనలేని ప్రాధాన్యత ఉంది.  తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత తొలిసారిగా హైదరాబాద్‌లో జరుగుతున్న అఖిలభారత మహసభలు కావడంతో ఎంతో ప్రత్యేకమైనవిగా సిపిఎం భావిస్తోంది. దేశ రాజకీయ పరిస్థితులను మహాసభల్లో క్షుణంగా చర్చిస్తామని, కేంద్ర ప్రభుత్వ విధానాలు, రైతాంగ, కార్మికుల సమస్యలపై చర్చలు జరుగుతాయని పార్టీ ప్రధాన కార్యదర్వి సీతారం ఏచూరి తెలిపారు. దేశానికి ప్రమాదకరంగా మారిన మతోన్మాదాన్ని, బిజెపిని ఎదుర్కుంటామని, ఆ దిశలో మహాసభలో చర్చలు సాగుతాయని తెలిసపారు. కథువా, ఉన్నావ్‌ సంఘటనలపై అడిగిన ప్రశ్నలకు ఆయన జవాబిస్తూ దేశంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. చిన్నారులు సైతం భయంకర పరిస్థితులను ఎదుర్కొంటున్నారని, లైంగిక దాడులకు లోనవుతున్నారని అన్నారు. కథువా,ఉన్నావ్‌ ఘటనలు సభ్యసమాజాన్ని తలవంచుకునేలా చేసాయని ఆయన వ్యాఖ్యానించారు. ఉత్తరప్రదేశ్‌లోని ఆధిత్యనాథ్‌యోగి నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం నిందితులను కాపాడేందుకు ప్రయత్నించడాన్ని ఖండించారు. అక్కడి ఎమ్మెల్యేపై లైంగిక దాడి అరోపణలు వచ్చినా పట్టించుకోలేదని చెప్పారు. కథువాలో చిన్నారిపై జరిగిన ఘటన కలిచివేసిందన్నారు. 15వ ఆర్థిక సంఘం నిధుల కేటాయింపులో దక్షిణాది రాష్టాల్రకు అన్యాయం జరిగిందని, దీనిపై కేరళలో ఆర్థిక మంత్రుల సమావేశం
జరగడం మంచి పరిణామమన్నారు. కేసీఆర్‌ ఫెడరల్‌ ప్రంట్‌ పై స్పందిస్తూ.. విధివిధానాలు వచ్చిన తరువాత చూద్దాం, ఆయన్ను మాట్లాడనీవ్వండి అని వ్యాఖ్యానించారు.