హైదరాబాద్‌ శాంతికి చిరునామా

3

– గతం కన్నా భేషుగ్గా ఉంది

– కోదండరామ్‌

మహబూబ్‌నగర్‌,జూన్‌25(జనంసాక్షి): రాజధానిలో గతంలో కన్నా శాంతిభద్రతలు మెరుగ్గా ఉన్నాయని, ఇది ఎవరిని అడిగినా చెబుతారని జెఎసి ఛైర్మన్‌ కోదండరామ్‌ అన్నారు. ఇన్నేళ్ల సమైక్య పాలనలో కన్నా ఇప్పుడే హైదరాబాద్‌ శాంతియుతంగా ఉందన్నారు. రెండు రాష్ట్రాలలో ప్రజలు ప్రశాంతంగా జీవిస్తున్నారని ఆయన అబిప్రాయపడ్డారు. ఎపి ప్రభుత్వ పెద్దలు సొంత ప్రయోజనాల కోసం హైదరాబాద్‌పై పెత్తనం చెలాయించాలని చూస్తున్నారని కోదండరామ్‌ అన్నారు. ఓటుకు నోటు కేసు వల్లే విభజన చట్టంలోని సెక్షన్‌ ఎనిమిది తెరపైకి వచ్చిందని వ్యాఖ్యానించారు. అనవసరంగా వివాదాలు సృష్టించి ప్రజల మధ్య అలజడులు కల్పించవద్దని ఆయన ఎపి నేతలను కోరారు. హైదరాబాద్‌ లో సెక్షన్‌ ఎనిమిది అవసరం లేదని ఆయన అబిప్రాయపడ్డారు. పాలమూరు పట్టణంలోని నిర్వహించిన జిల్లా ఆలయ అర్చక, ఉద్యోగుల మహాసభకు జేఏసీ చైర్మన్‌ కోదండరాం హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జీవో 10 పద్ధతిన  అర్చక ఉద్యోగులకు వేతనాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న అర్చకులు, సిబ్బందికి జేఏసీగా అండగా ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు.