హైదరాబాద్ సహా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు
హైదరాబాద్,సెప్టెంబర్22 జనం సాక్షి: రాజధాని హైదరాబాద్ సహా తెలంగాణ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి ఓ మోస్తరు వర్షం కురుస్తోంది. శుక్రవారం తెల్లవారుజాము నుంచి హైదరాబాద్‌లోని ఖైరతాబాద్, అవిూర్‌పేట, పంజాగుట్ట, ఎస్‌ఆర్‌నగర్, సనత్ నగర్, బోరబండ, కాప్రా, ఈసీఐఎల్, మల్కాజిగిరి, ముషీరాబాద్, కూకట్‌పల్లి, హైదర్‌నగర్, ఆల్విన్ కాలనీ, మూసాపేట, ప్రగతి నగర్, నిజాంపేట, బాచుపల్లి, సైదాబాద్, మలక్‌పేట, దిల్‌సుఖ్‌నగర్, ఎల్బీనగర్, వనస్థలిపురం, ఉప్పల్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, కొండాపూర్‌లో వర్షం కురిసింది. పలు ప్రాంతాల్లో రహదారులు జలమయమయ్యాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తున్నది. దీంతో సింగరేణి గనుల్లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. కేటీకే ఉపరితల గని`2, 3లో బొగ్గు ఉత్పత్తి ఆగిపోయింది. మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పలు ప్రాంతాలకు వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. కే.సముద్రం మండలం అర్పణపల్లి బ్రిడ్జిపై వట్టివాగు ఉధృతంగా ప్రవహిస్తున్నది. దీంతో కే.సముద్రం నుంచి గూడూరుకు వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడిరది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో భారీ వాన పడుతున్నది. రాగల రెండు రోజుల పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. శుక్రవారం ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. పలుచోట్ల ఉరుములు, మెరుపులతో వాన పడుతుందని చెప్పింది. ఈ మేరకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.