హోమంత్రి పదవిని ఆశించడం లేదు: సునీతారెడ్డి

మెదక్‌: సబితా ఇంద్రారెడ్డి రాజీనామా చేయడంతో ఖాళీగా ఉన్న హోమంత్రి పదవిని ఆశించడంలేదని మంత్రి సునీతాలక్ష్మారెడ్డి చెప్పారు. మెదక్‌ జిల్లా వెల్దుర్తి మండలంలో శనివారం జరిగిన కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తల విస్తృత సమావేశంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలు తమ సత్తా చాటాలని చెప్పారు. విలేకరులు హోమంత్రి పదవి విషయమై ప్రశ్నించగా తాను మాత్రం హోమంత్రి  పదవిని ఆశించడం లేదని ఇప్పటి వరకు ప్రభుత్వం అప్పగించిన ఏ పదవినైనా బాధ్యతాయుతంగా నిర్వర్తించానని చెప్పారు. బంగారు తల్లి పథకానికి చట్టబద్ధత కల్పిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్‌ పార్టీ నాయకులు అనంత రెడ్డి, శంకర్‌గౌడ్‌, జయరాంరెడ్డి, మోహన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.