హోలీ ఉత్సవాలు: విదేశీ మహిళపై సాధువు అత్యాచారం

లక్నో: హోళీ ఉత్సవాల కోసం ఉత్తరప్రదేశ్‌లోని వృందావన్‌కు వచ్చిన 40 ఏళ్ల అమెరికన్ మహిళపై ఓ సాధువు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆమెను తీవ్రంగా కొట్టి, లైంగిక దాడి చేసినట్లు పోలీసులు వెల్లడించారు. స్వతహాగా శ్రీష్ణుడి భక్తురాలైన ఆమె కాలిఫోర్నియాకు చెందిన మహిళగా గుర్తించారు. ఫిబ్రవరి 26న హోలీ ఉత్సవాల కోసం వృందావన్‌కు వచ్చి ఓ గెస్టు హౌస్‌లో దిగింది. మరుసటి రోజు నుంచి కనిపించకుండా పోయింది. ఆ తర్వాత తీవ్రగాయాలతో స్పృహ కోల్పోయి, రోడ్డు పక్కన పడిఉన్న ఆమెను పోలీసులు గుర్తించారు. మెలకువ వచ్చిన అనంతరం ఆమెను పోలీసులు ప్రశ్నించగా నిజానిజాలు వెలుగు చూశాయి. తులసీ మాల ధరించిన ఓ సాధువు తనపై లైంగిక దాడికి పాల్పడినట్లు తెలిపింది. హోలీ ఉత్సవాలు: విదేశీ మహిళపై సాధువు అత్యాచారం దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. మంగళవారం సాయంత్రం పోలీసు ఎస్కార్టు సాయంతో ఆమెను మధుర జిల్లా ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. బుధవారం ఉదయం ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించారు. వైద్య పరీక్షలు నిర్వహించిన ఆసుపత్రి వర్గాలు ప్రస్తుతం ఆమె తీవ్రమైన షాక్ స్థితిలో ఉందని, తనపై జరిగిన దాడి కారణంగా చాలా భయపడిందని చెప్పారు. ఇప్పటి వరకు చేసిన వైద్య పరీక్షల్లో ఆమె లైంగిక వేధింపులకు గురైనట్లు సూచించలేదని, మిగతా పరీక్షల నిమిత్తం ఆమెను ఆగ్రాకు పంపుతున్నట్లు తెలిపారు.