వాఘాలో స్వీట్లు.. పూంచ్‌లో కాల్పులు


14brk94aన్యూదిల్లీ: స్వాతంత్య్ర దినోత్సవం రోజున పాకిస్థాన్‌ తన కుటిల నీతిని ప్రదర్శించింది. ఒకవైపు అత్యంత ఘనంగా దేశ 70వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని నిర్వహిస్తూనే భారత్‌పై జవాన్ల లక్ష్యంగా కాల్పులు జరిపి… కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడిచింది.
పాకిస్థాన్‌ మనకంటే ఒకరోజు ముందుగా స్వాతంత్య్ర దినోత్సవాన్ని(ఆగస్టు 14) నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో ఆ దేశంలో పండుగ వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా అక్కడి సైనిక సిబ్బంది సరిహద్దులో సంబరాలు నిర్వహించారు. దేశ సరిహద్దు ప్రాంతమైన వాఘాలో మన దేశానికి చెందిన సైనికులకు స్వీట్లు కూడా పంచిపెట్టారు. మరోవైపు ఈ తెల్లవారుజామున కశ్మీర్‌లోని పూంచ్‌ ప్రాంతంలో పాక్‌ సైన్యం కాల్పులకు తెగబడింది. అప్రమత్తమైన భారత సైనికదళాలు దాడిని సమర్థంగా తిప్పికొట్టాయని డిఫెన్స్‌ అధికారి కల్నల్‌ మనీష్‌ మెహతా తెలిపారు.

దేశ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రసంగించిన ఆ దేశ అధ్యక్షుడు మమ్నూన్‌ హుస్సేన్‌ కశ్మీర్‌ అంశాన్ని లేవనెత్తారు. కశ్మీర్‌ అంశాన్ని ఎట్టి పరిస్థితుల్లో వీడే ప్రసక్తే లేదని, అక్కడి ప్రజలకు తమ మద్దతు కొనసాగుతుందని పేర్కొన్నారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా అత్యంత భద్రత నడుమ దేశ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌, ఇతర మంత్రులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు.

దిల్లీలోని పాక్‌ రాయబార కార్యాలయంలో జరిగిన వేడుకల్లోనూ ఆ దేశ రాయబారి అబ్దుల్‌ బాసిత్‌ కశ్మీర్‌ అంశాన్ని లేవనెత్తారు. ఈ ఏడాది వేడుకలు కశ్మీర్‌ స్వాతంత్య్ర వేడుకలుగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు.