చెన్నై దుర్ఘటనలో 11కి చేరిన మృతులు

7jjkig3m
ఎక్కువ మంది కళింగాంధ్ర కూలీలే 
చెన్నై: తమిళనాడు రాజధాని చెన్నై సమీపంలోని మొగలివాక్కంలో శనివారం సాయంత్రం నిర్మాణంలో ఉన్న 11 అంతస్తుల భవనం కూలిన ఘటనలో మృతుల సంఖ్య 11కి చేరింది. సునీత అనే మహిళ ఆదివారం ఉదయం శిథిలాల నుంచి ప్రాణాలతో బయటపడింది. శిథిలాల నుంచి 29మందిని రక్షించినట్లు అధికారులు తెలిపారు. 24 మంది క్షతగాత్రులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇంకా 32 మంది శిథిలాల్లో చిక్కుకున్నట్లు అధికారులు భావిస్తున్నారు. ప్రమాద స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మృతులు, గాయపడిన వారి వివరాలను తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది. ప్రమాదంలో గాయపడిన తెలుగువారు లక్ష్మీ, రమణమ్మ, పాపారావు, బాలినాయుడు, రాజా, సతీష్‌, సుజాత, విజయ్‌కుమార్‌, సునీత చెన్నైలోని శ్రీరామచంద్ర ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. దుర్ఘటనలో మృతిచెందిన వారి కుటుంబాలకు రూ.2లక్షలు, గాయపడిన వారికి రూ.50వేలు చొప్పున తమిళనాడు ప్రభుత్వ పరిహారం ప్రకటించింది. 

చెన్నై: తమిళనాడు రాజధాని చెన్నై సమీపంలోని మొగలివాక్కంలో శనివారం సాయంత్రం నిర్మాణంలో ఉన్న 11 అంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. ఆ సమయంలో భవనంలో 80 మంది వరకు కార్మికులు నిర్మాణ పనుల్లో నిమగ్నమై ఉన్నారు. వారిలో ఎంత మంది మరణించిదీ తేలాల్సి ఉంది. కార్మికుల్లో విజయనగరం, విశాఖపట్నం, ఒరిస్సా ప్రాంతాలకు చెందినవారు కూడా ఉన్నారని సమాచారం. అరక్కోణం నుంచి జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ (ఎన్డీఆర్‌ఆఫ్‌) బలగాలు, తమిళనాడు అగ్నిమాపకదళం, పోలీసు విభాగాలకు చెందిన సిబ్బంది భారీ ఎత్తున సహాయక చర్యలు చేపట్టారు. చెన్నై కార్పొరేషన్‌, చెన్నై మెట్రో రైలు, రహదారుల విభాగానికి చెందిన సాంకేతిక నిపుణులు, భారీ యంత్రాలతో శిథిలాలను తొలగిస్తున్నారు. రాత్రి 10 గంటల వరకు ఐదు మృతదేహాలు దొరికాయి. 17 మంది క్షతగాత్రులను శిథిలాల నుంచి వెలికితీసి చికిత్స నిమిత్తం సమీపంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం సాయంత్రం 5గంటలకు జరిగింది. రాత్రి కావటంతో సహాయక చర్యలకు ఎలాంటి అడ్డంకులు లేకుండా ఉండేందుకు ఫ్లడ్‌లైట్లను ఏర్పాటు చేశారు. శిథిలాల కింద 50-60 మంది కూలీలు ఉండే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఉరుములతో కూడిన వర్షం కురిసిన అనంతరం భవనం కూలిపోయిందని స్థానికులు చెబుతున్నారు. అక్కడి నేలతీరును బట్టి ఐదు అంతస్తులకు మించి భవనాలు నిర్మించేందుకు అనుమతి లేదు. అలాంటిది 11 అంతస్తులకు అనుమతులు ఇవ్వటం కూడా ప్రమాదానికి ఓ కారణమని అంటున్నారు. 

టీ తాగేందుకు వెళ్లా: శిథిలాల్లో తన భార్య కూడా చిక్కుకుందని విజయనగరం జిల్లా దత్తరాజేరు మండలం, కోరపు కృష్ణాపురం గ్రామానికి చెందిన అప్పలనాయుడు ‘న్యూస్‌టుడే’కు తెలిపారు. తన భార్య |డమ్మతో కలిసి అప్పటి వరకు తానూ అక్కడే ఉన్నానని, మధ్యలో టీ తాగేందుకు క్యాంటీన్‌కు వచ్చినపుడు ప్రమాదం జరిగిందని చెప్పారు. పదకొండో అంతస్తు పైన 60 మంది పని చేస్తున్నారని, వర్షం రావటంతో వారంతా కింది అంతస్తుల్లోకి వచ్చారని తెలిపారు. వారిలో ఎంతమంది శిథిలాల కింద చిక్కుకున్నారో తనకు తెలియదన్నారు. కార్మికుల్లో విజయనగరానికి చెందిన సుమారు 20 మంది ఉన్నారని, శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాలతో పాటు ఒరిస్సాకు చెందిన భవన నిర్మాణ కార్మికులు కూడా అక్కడ విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు. 

జయలలిత దిగ్భ్రాంతి: ప్రమాదం పట్ల తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. వేగవంతంగా సహాయక చర్యలను చేపట్టాలని ఆదేశించారు. సమగ్ర విచారణ జరిపి సంబంధితులపై కఠిన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించానని శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. తమిళనాడు గవర్నర్‌ రోశయ్య కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. శిథిలాల కింద చిక్కుకున్న వారు క్షేమంగా బయట పడాలని ఆకాంక్షించారు. 
ఆదుకునేందుకు చర్యలు 
ఈనాడు-హైదరాబాద్‌: తమిళనాడు ప్రభుత్వంతో సహాయక చర్యల్ని సమన్వయం చేసేందుకు చెన్నైకి వెళ్లాలని కార్మిక శాఖ జాయింట్‌ కమిషనర్‌ను ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్‌ కృష్ణారావు ఆదేశించారు. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు ఆయన తమిళనాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో శనివారం ఫోన్‌లో మాట్లాడారు. తెలుగువారిని ఆదుకునేందుకు అవసరమైన అన్నిరకాల సహాయక చర్యలు చేపట్టాలని కోరారు. మరణించిన వారి కుటుంబాలను ఆదుకోవాలన్నారు. విజయనగరం కార్మికులు చిక్కుకు పోవడంపై కార్మిక మంతి అచ్చెన్నాయుడు విచారం వ్యక్తంచేశారు. బాధితులను రాష్ట్ర ప్రభుత్వం అన్నివిధానాలుగా ఆదుకుంటుందన్నారు. 

కొనసాగుతున్న సహాయక చర్యలు 
ట్రస్టు హైట్స్‌ భవనం వద్ద సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అరక్కోణం నుంచి జాతీయ విపత్తు నిర్హహణ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. వీరితోపాటు అగ్నిమాపక సిబ్బంది, స్థానిక అధికారులు సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. ఇప్పటివరకు శిథిలాల నుంచి ఇద్దరిని సహాయ సిబ్బంది రక్షించారు. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఘటనపై ఎప్పటికప్పుడు అధికారులతో మాట్లాడుతూ సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. 
శిథిలాల్లో చిక్కుకున్న వారిలో 15మంది విజయనగరం జిల్లా కూలీలు 
భవనం శిథిలాల్లో 15 మంది విజయనగరం జిల్లాకు చెందిన కూలీలు ఉన్నట్లు సమాచారం. వీరు జిల్లాలోని మక్కువ, దత్తిరాజేరు, గజపతినగరానికి చెందినవారుగా భావిస్తున్నారు. చెన్నై నుంచి ఎప్పటికప్పుడు విజయనగరం జిల్లా కలెక్టర్‌ ఘటన గురించి సమాచారం తెలుసుకుంటున్నారు.