12వ తరగతి వరకు ఉచిత విద్య
` స్కూలు పిల్లలకు అలవెన్స్‌లు
` మధ్యప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో ప్రియాంక బిజీ
మాండ్లా(జనంసాక్షి): మధ్యప్రదేశ్ లో 12వ తరగతి వరకు ఉచిత విద్య అందిస్తామని, స్కూలు పిల్లలకు అలవెన్స్‌లు కూడా ఇస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ హావిూ ఇచ్చారు. ఆదివాసీ ప్రాంతంలో ఉన్న మాండ్లా జిల్లాలో జరిగిన ఎన్నికల ర్యాలీలో ప్రియాంక పాల్గొన్నారు. రాష్ట్రంలో తాము అధికారంలోకి వస్తే పఢో` పఢావో పథకం కింద 12వ తరగతి వరకు ఉచిత విద్యతో పాటు 1 నుంచి 8 తరగతుల విద్యార్థులకి నెలకి రూ.500, 9,10 తరగతి విద్యార్థులకి నెలకి వెయ్యి రూపాయలు, 11, 12 తరగతి విద్యార్థులకి నెలకి రూ.1500 ఇస్తామన్నారు. రాష్ట్రంలో కులగణన చేపడతామని ప్రియాంక గాంధీ పునరుద్ఘాటించారు. ఆదివాసీలు, ఇతర వెనుక బడిన వర్గాల వారికి జనాభాలో తమ నిష్పత్తి ఆధారంగా ఉద్యోగాలు రావడం లేదన్నారు. అందుకే కులగణన చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. ‘బిహార్‌లో ఇటీవల రాష్ట్రంలో కులగణన నిర్వహిస్తే జనాభాలో 84 శాతం ఎస్‌సీలు, ఎస్టీలు, ఓబీసీలు ఉన్నారని తేలింది. కానీ ఉద్యోగాలు చేస్తున్న వారి లో వారి సంఖ్య చాలా తక్కువగా ఉంది. దేశవ్యాప్తంగా కులగణన జరగాల్సి ఉన్నప్పటికీ కేంద్రం పట్టించుకోవడం లేదు‘ అని ప్రియాంక అన్నారు.