ప్రణబ్‌పై కాంగ్రెస్‌ నేతల ప్రశంసలు

ఆర్‌ఎస్‌ఎస్‌ సభలో కాంగ్రెస్‌ సిద్ధాంతాలను ప్రస్తావించడం బాగుంది
న్యూఢిల్లీ, జూన్‌8(జ‌నం సాక్షి) : నాగ్‌పూర్‌లో ఆర్‌ఎస్‌ఎస్‌ శిక్షా వర్గ్‌సభలో మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ చేసిన ప్రసంగంపై కాంగ్రెస్‌ నేతలు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఆర్‌ఎస్‌ఎస్‌ సభలో కాంగ్రెస్‌ సిద్ధాంతాలను గురించి ప్రస్తావించడం బాగుందని ఆ పార్టీ సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం అన్నారు. ప్రణబ్‌ ప్రసంగం గురించి ఆయన ట్విటర్‌ ద్వారా స్పందించారు. కాంగ్రెస్‌ సిద్ధాంతాలు ఏంటో ప్రణబ్‌ముఖర్జీ ఆర్‌ఎస్‌ఎస్‌కు తెలియజేసినందుకు చాలా సంతోషంగా ఉంది. అలాగే కొన్ని ఆర్‌ఎస్‌ఎస్‌ సిద్ధాంతాలు తప్పు అని ఆయన చెప్పడం చక్కగా ఉంది అని చిదంబరం పేర్కొన్నారు. ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యక్రమానికి ప్రణబ్‌ వెళ్లాలని నిర్ణయించుకున్న సమయంలో చిదంబరం ఓ విజ్ఞప్తి చేశారు. ‘విూరు(ప్రణబ్‌) వెళ్లి ఆర్‌ఎస్‌ఎస్‌ సిద్ధాంతాల్లో ఉన్న తప్పేంటో వాళ్లకి చెప్పండి’ అని చిదంబరం ఇటీవల ప్రణబ్‌ను కోరారు. ఈ సందర్భంగా నిన్న జరిగిన సమావేశంలో ప్రణబ్‌ చేసిన ప్రసంగాన్ని మెచ్చుకుంటూ ‘నా విజ్ఞప్తిని మన్నించి.. ఆర్‌ఎస్‌ఎస్‌ తప్పులేమిటో వాళ్లకి చెప్పినందుకు సంతోషంగా ఉంది’ అని చిదంబరం పేర్కొన్నారు. చిదంబరంతో పాటు కాంగ్రెస్‌కు చెందిన ఆనంద్‌శర్మ, రణ్‌దీప్‌ సుర్జేవాలా కూడా ప్రణబ్‌ ప్రసంగాన్ని మెచ్చుకున్నారు. ‘భారత్‌లోని భిన్నత్వాన్ని, సహనాన్ని, లౌకికవాదాన్ని ప్రణబ్‌ గుర్తు చేశారు. ఆయన ప్రసంగం ద్వారా ఇచ్చిన సలహాను అనుసరించి ఆర్‌ఎస్‌ఎస్‌, భాజపాలు తమ స్వభావాన్ని, దృక్పథాన్ని, ఆలోచన విధానాన్ని మార్చుకుంటాయా?’ అని సుర్జేవాలా ప్రశ్నించారు.