నిండుకుండలా హుస్సేన్‌ సాగర్‌
ఒక్క గేటు ఎత్తి దిగువకు నీటి విడుదల

హైదరాబాద్‌,జూలై13( జనం సాక్షి): హుస్సేన్‌ సాగర్‌ నీటి మట్టం గరిష్టస్థాయికి చేరుకుంది. నగరంలో
కురుస్తున్న వర్షాలతో చెరువులు నిండిపోయాయి. చిన్న చిన్న చెరువుల నుంచి నీరు వచ్చి చేరడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. హుస్సేన్‌ సాగర్‌ పూర్తిస్థాయి నీటి మట్టం 513.45 అడుగులు ఉండగా..ప్రస్తుతం 513.41 అడుగులకు చేరుకుంది. దీంతో అధికారులు ఒక గేట్‌ ఎత్తి నీటిని కిందకు విడుదల చేశారు. చిన్న చిన్న నాలాల ద్వారా ఈ నీరు మూసి నీదిలోకి వచ్చి చేరుతోంది. ఒక్కసారిగా గేట్లు ఓపెన్‌ చేస్తే.. ట్యాంక్‌ బండ్‌ పరిసర ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. సమాచారం తెలుసుకున్న జీహెచ్‌ఎంసి, ఇరిగేషన్‌ అధికారులు హుస్సేన్‌ సాగర్‌ నీటి పరిస్థితిని సవిూక్షించారు. సాగర్‌ లోకి 1500 క్యూసెక్కుల ఇన్‌ ప్లో ఉందని, ఔట్‌ ప్లో కూడా 1500 క్యూసెక్కులుగా ఉందని అధికారులు తెలిపారు. మూడు ప్రధాన నాలాల నుండి సాగర్‌ లోకి నీరు వస్తోందని, నీళ్లను కిందికి వదిలినట్లు వెల్లడిరచారు. ఎలాంటి ఇబ్బంది పరిస్థితులు లేవని స్ఫష్టం చేశారు. నీటి ప్రవాహం పెరిగితే మరో గేట్‌ ఓపెన్‌ చేస్తామని వెల్లడిస్తున్నారు. అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో ఆగకుండా వానలు పడుతున్నాయి. మరో నాలుగు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉంటాయని వాతావరణశాఖ మరోసారి అలర్ట్‌ ఇచ్చింది. హైదరాబాద్‌ లోని ఆయా ప్రాంతాల్లో తెలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిశాయి. చందానగర్‌ లోని అర్బన్‌ హెల్త్‌ సెంటర్‌ దగ్గర 4 సెంటీ విూటర్ల మోస్తరు వర్షం నమోదవుగా…గాజులరామారంలో 3.5 సెంటీవిూటర్ల మోస్తారు వర్షం కురిసింది. బాలానగర్‌, చందానగర్‌, మలక్‌ పేట్‌, జీడిమెట్లలో 3.5 సెంటీ విూటర్ల మోస్తరు వర్షం కురిసింది. ఖైరతాబాద్‌, కూకట్‌ పల్లి, చార్మినార్‌, అంబర్‌ పేట్‌, జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌, కుత్బుల్లాపూర్‌, గోషామహల్‌, నాంపల్లి, ఫలక్‌ నుమా, మూసాపేట్‌ లో 3 సెంటీ విూటర్ల వర్షపాతం నమోదవ్వగా.. సిటీలోని మిగతా ఏరియాల్లో తేలికపాటి వర్షాలు కురిశాయి.