న్యూఢిల్లీ : యుపిఎ సంకీర్ణ ప్రభుత్వానికి పదేళ్లపాటు సారథ్యం వహించిన ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ పదవీ విరమణ సందర్భంగా ‘ప్రజలనుద్దేశించి’ వీడ్కోలు ప్రసంగం చేయనున్నారు.లోక్ సభ ఎన్నికల ఫలితాలు వెలువడిన మరుసటి రోజు మే 17న ప్రధాని మన్మోహన్ సింగ్ పదవి నుంచి వైదొలగనున్నారు. వరుసగా రెండు పర్యాయాలు యుపిఎ ప్రభుత్వాలకు దశాబ్దంపాటు నేతృత్వం వహించిన మన్మోహన్ ఈ ఏడాది ప్రారంభంలోనే తాను ఇక అధికార బాధ్యతల నుంచి తప్పుకుంటానని ప్రకటించారు.‘‘అది ఒక రకంగా ప్రజలనుద్దేశించే చేసే ఉపన్యాసం. ఉపన్యాస పాఠాన్ని రాసే ప్రక్రియ మొదలైంది’’ అని పిఎంఓ అధికారి ఒకరు తెలిపారు. ఈ ఏడాది జనవరి 3న ప్రధాని తన తుది విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ పదేళ్లలో ఆయన నిర్వహించిన మూడవ విలేకరుల సమావేశం ఇది. అదే సమావేశంలో తాను రాజకీయాల నుంచి విరమించుకుంటున్నట్లు ఆయన ప్రకటించారు.