19న టీడీపీ తీర్థంపుచ్చుకోనున్న నందీశ్వర్‌గౌడ్
హైదరాబాద్, అక్టోబర్15(జనంసాక్షి) : పటాన్‌చెరు మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్‌గౌడ్ టీడీపీ తీర్థం పుచ్చుకోనున్నారు. ఈ నెల19న తెలుగుదేశం పార్టీలో చేరుతున్నట్లు ఆయన ప్రకటించారు. ఎన్టీఆర్ ఆశయాల కోసమే టీడీపీలో చేరుతున్నట్లు వెల్లడించారు. ఎమ్మెల్యే స్థాయికి ఎదిగానంటే దానికి ఎన్టీఆరే కారణమన్నారు. తెలంగాణలో టీడీపీ ద్వారానే బీసీలకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నానన్నారు. మహాకూటమిలో ఎవరికి టికెట్ ఇచ్చినా పనిచేస్తానని చెప్పారు. నందీశ్వర్ గౌడ్.. 2009 నుంచి 2014 వరకు కాంగ్రెస్ ఎమ్మెల్యేగా పనిచేశారు. 2014లో టీఆర్‌ఎస్ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు. అనంతరం కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలో చేరారు. అక్కడ ఇమడలేకపోవడంతో తిరిగి కాంగ్రెస్ గూటికి చేరనున్నట్లు ప్రచారం జరిగింది. కానీ కాంగ్రెస్‌లోకి కాకుండా టీడీపీలో చేరాలని నిర్ణయించుకున్నారు. మహాకూటమిలో భాగంగా పటాన్‌చెరు టికెట్ టీడీపీకి ఇచ్చేందుకు కాంగ్రెస్ సుముఖంగా ఉన్నట్టు తెలుస్తోంది. టీడీపీలో చేరితే ఆ టికెట్ తనకు దక్కే అవకాశం ఉందని నందీశ్వర్ గౌడ్ ముందస్తుగా అంచనా వేసుకున్నట్లు సమాచారం. ఆంధ్రా ఓట్లు కూడా ఎక్కువగా ఉన్నాయన్న ఆలోచనతో నందీశ్వర్ గౌడ్ టీడీపీలో చేరాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.