19న మెగా జాబ్మేళా: మంత్రి
నాగర్కర్నూల్,జూలై10:(జనం సాక్షి ): జిల్లాలోని కొల్లాపూర్ పట్టణంలో ఈ నెల 19న మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రావిూణాభివృద్ధి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రకటించారు. ఈ సందర్భంగా జాబ్ మేళా నిర్వహణపై వీఓఏలకు ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో మంత్రి పాల్గొని ప్రసంగించారు. ఈ జాబ్ మేళాలో 100కు పైగా కంపెనీలు పాల్గొంటాయని మంత్రి తెలిపారు. 2 వేల మంది యువతకు ఉద్యోగావకాశాలు వస్తాయన్నారు. ఆసక్తి, అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. తెలంగాణలోని మానవ వనరులన్ని సద్వినియోగంచేసుకోగలిగితేనే బంగారు తెలంగాణ సాధ్యమవుతుందన్నారు. త్వరలో గద్వాల, నాగర్కర్నూల్లోనూ జాబ్ మేళాలు నిర్వహిస్తామని మంత్రి జూపల్లి స్పష్టం చేశారు.
పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ ప్రారంభం
వీఆర్వో, గ్రూప్ -4 ఉద్యోగాలకు ప్రిపేరయ్యే అభ్యర్థులకు ఉచిత శిక్షణ క్లాసులను మంత్రి జూపల్లి కృష్ణారావు ఇవాళ ప్రారంభించారు. ఈ ఉచిత క్లాసులను విద్యార్థులు సద్వినియోగం చేసుకొని ప్రభుత్వ ఉద్యోగాలను సాధించాలని జూపల్లి చెప్పారు. లక్ష ఉద్యోగాలను కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు.