19 నుంచి ఆంధ్ర అసెంబ్లీ
కాంగ్రెస్ లేకుండా మొదటిసారి
హైదరాబాద్, జూన్ 15 (జనంసాక్షి) :
ఆంధ్రప్రదేశ్ శాసనసభ మొదటి సమావేశాలు ఈ నెల 19 నుంచి ప్రారంభంకానున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రానికి చెందిన ఉన్న తాధికారులు శాసనసభ సమావేశ మందిరాలను పరిశీలించారు. 18వ తేదీన ప్రొటెం స్పీకర్‌గా నారాయణ స్వామి ప్రమాణ స్వీకా రం చేయనున్నారు. 19న చంద్రబాబుతో సహా సభ్యుందరి చేత ఆయన ప్రమాణ స్వీకారం చేయిస్తారు. 20న స్పీకర్, డెప్యూటీ స్పీకర్ ఎన్నిక జరుగుతుంది. 21న ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగిస్తారు. 23, 24 తేదీల్లో
గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ ఉంటుంది. చర్చలో ముఖ్యమంత్రి ప్రసంగించిన తరువాత సమావేశాలు ముగుస్తాయి. ప్రస్తుతం అసెంబ్లీ ఉన్న ఆవరణలో పాత అసెంబ్లీ హాలు, శాసనమండలిని ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించారు. ఇప్పటి వరకు ఉన్న టీడీపీ పక్షం శాసనసభ కార్యాలయాన్ని, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అసెంబ్లీ చాంబర్‌గా మారుస్తున్నారు. ఇందుకు సంబంధించిన పనులు చురుకుగా సాగుతున్నాయి. అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి సీమాంధ్ర జిల్లాలతో కూడిన ప్రాంతం కొత్త రాష్ట్రంగా ఏర్పడటం, శాసనసభలో కాంగ్రెస్‌కు ప్రాతినిథ్యమే లభించకపోవడం ఈ సభలో విశేషాలు. ఆంధ్ర, హైదరాబాద్ స్టేట్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని ప్రతి శాసనసభలో కాంగ్రెస్‌కు ప్రాతినిథ్యం ఉండగా, కాంగ్రెస్ సభ్యులెవరూ లేకుండా మొదటి సారి శాసనసభ సమావేశం కాబోతోంది.