196గ్రేస్‌ మార్కులు ఇవ్వండి

– సీబీఎస్‌ఈకి మద్రాస్‌ హైకోర్టు ఆదేశం
– తమిళంలో నీట్‌ పరీక్ష రాసిన విద్యార్థులకు ఊరట
చెన్నై, జులై10(జ‌నంసాక్షి) : ఈ ఏడాది తమిళంలో నీట్‌ పరీక్ష రాసిన విద్యార్థులకు 196 గ్రేస్‌ మార్కులు ఇవ్వాల్సిందిగా సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ బోర్డ్‌ (సీబీఎస్‌ఈ)కి మద్రాస్‌ హైకోర్టు మంగళవారం ఆదేశించింది. ఈ సారి ఇచ్చిన నీట్‌ ప్రశ్నప్రత్నంలో 49 ప్రశ్నలకు సంబంధించి 60 అనువాద పొరపాట్లు ఉన్నాయని కోర్టు పేర్కొంది. రెండు వారాల్లోగా కొత్త ర్యాంకులను ప్రకటించాలని హైకోర్టు ఆదేశించింది. మెడికల్‌, డెంటల్‌ కోర్సులకు ఈ ఏడాది మే 6వ తేదీన నీట్‌ పరీక్షను  సీబీఎస్‌ఈ నిర్వహించింది. ఈ ఫలితాలు జూన్‌ 4న విడుదలయ్యాయి. ఇప్పటికే ర్యాంకులు ఇవ్వడంతో అనేక రాష్ట్రాల్లో కౌన్సిలంగ్‌ కూడా మొదలైంది. ఇపుడు కోర్టు ఏకంగా 196గ్రేస్‌ మార్కులు ఇవ్వమని పేర్కొనడంతో మొత్తం ర్యాంకింగ్స్‌ భారీగా మారే అవకాశముంది. నీట్‌ ప్రశ్నపత్రం తమిళంలో అనువదించే సమయంలో భారీగా పొరపాట్లు జరిగాయిని టెక్‌ఫర్‌ ఆల్‌ అనే స్వచ్ఛంద సంస్థ ఆరోపించింది. ప్రధానితో పాటు తమిళనాడు సీఎంకు లేఖ కూడా రాసింది. ఈసారి రాష్ట్రంలో 24500 మంది విద్యార్థులు తమిళంలో నీట్‌ రాశారు. కాగా హైకోర్టు తీర్పుతో తమిళలంలో నీట్‌ పరీక్ష రాసిన విద్యార్థులకు కొంత ఊరట కలగనుంది.