2న జరిగేది ఎన్నికల శంఖారావమే
బలప్రదర్శనే ప్రథమ లక్ష్యం
జనాలను తీసుకుని రావడం ఇక నేతల వంతు
హైదరాబాద్,ఆగస్ట్25(జనం సాక్షి): ముఖ్యమంత్రి కేసీఆర్ సెప్టెంబర్ 2న చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో 25 లక్షల మందితో ప్రగతి నివేదన సభను నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఈ మేరకు శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఓ రకంగా ఇదే తొలి సమరశంఖం కానుంది. ప్రస్తుత సమాచారం మేరకు సిఎం కెసిఆర్ గెపుపై ధీమా ఉన్నా ఎందుకనో ముందస్తు ఎన్నికలకు మొగ్గుగా ఉన్నట్లుగా అర్థం అవుతోంది. తెలంగాణ సర్కార్ నాలుగున్నరేళ్లుగా చేస్తున్న అభివృద్ధి, సంక్షేమాన్ని ప్రజలకు నివేదించేందుకు ఈ సభను ఉద్దేశించినా కేవలం ఎన్నికల శంఖం పూరించడానికే అన్నది సుస్పస్టం. వరంగల్ జిల్లాలో 2010, డిసెంబర్ 16న నిర్వహించిన సింహగర్జన తెలంగాణ ఉద్యమానికి ఊపిరిగా నిలిచింది. తెలంగాణ సమాజం టీఆర్‌ఎస్ వెంటనే ఉందన్న నమ్మకాన్ని ప్రపంచానికి చాటిచెప్పాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ సభను ఏర్పాటు చేస్తున్నట్లు అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రగతి నివేదన సభలో ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి మరింత తీసుకెళ్లాలి అని పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. ప్రగతి నివేదన బహిరంగ సభను విజయవంతం చేసేందుకు గ్రావిూణస్థాయి నుంచి రాష్ట్రస్థాయి నాయకుల వరకు సన్నద్దం చేస్తోంది. ప్రగతి నివేదన సభ ద్వారా పార్టీ నేతలను ప్రస్తుత ఎన్నికలకు సన్నద్దం చేయడం,అలాగే టీఆర్‌ఎస్ విధానాలను, కార్యక్రమాలను ప్రజల్లోకి ముందుకు తీసుకెళ్లేందుకు పార్టీని సమాయత్త పరచడం కెసిఆర్ లక్ష్యంగా ఉంది. గ్రామ స్థాయి కార్యకర్త నుంచి రాష్ట్ర నాయకుల వరకు అందరూ ఇందులో భాగస్వామ్యం కావాలని కెసిఆర్ సూచించారు. నియోజవర్గాల వారీగా జనసవిూకరణ ఏర్పాట్లు చేసుకోవాలన్న ఆదేవాలు ఇచ్చారు. బస్సులతో పాటు ప్రైవేటు వాహనాలు కావాల్సినన్నిఏర్పాటు చేసుకోవాలి. మండలాల వారీగా సమావేశాలు పెట్టుకుని సమన్వయం చేసుకోవాలి. ప్రతి గ్రామం నుంచి, మండలం నుంచి పార్టీకి బాధ్యులను ఏర్పాటు చేసుకోవాలి. ఇందులో అశ్రద్ధ, నిర్లక్ష్యం చేయవద్దని సీఎం కేసీఆర్ చెప్పారు. పెద్దఎత్తున జనసవిూకరణ చేసి మన బలం చూపాలి.


