2కోట్లకు చిట్టీల వ్యాపారి కుచ్చుటోపి

రాత్రికిరాత్రే బిచాణా ఎత్తివేత
లబోదిబోమంటున్న బాదితులు
యాదాద్రి,మే30(జ‌నం సాక్షి): యాదగిరిగుట్టలో చిట్టీల పేరుతో జనాలకు కుచ్చుటోపీ పెట్టి, దాదాపు రూ.2 కోట్లతో ఉడాయించాడు ఓ ప్రబుద్ధుడు. చిట్టీల పేరులతో జనాలను నమ్మించి దాదాపు 50 మంది నుంచి డబ్బులు వసూలు చేసి ఉమాప్రభాకర్‌ రెడ్డి అనే చిట్టీల వ్యాపారి పరారయ్యాడు. దీంతో చిట్టీల వ్యాపారి ఇంటిముందు బాధితులు ఆందోళనకు దిగారు. యాదాద్రి జిల్లా యాదగిరిగుట్టలో గత 25 ఏళ్లుగా ఉమాప్రభాకర్‌ రెడ్డి అనే వ్యక్తి చిట్టీల వ్యాపారం చేస్తున్నాడు. అయితే ఇన్నిరోజులుగా నమ్మకంగా చిట్టీల డబ్బులు ఇస్తుండటంతో యాదగిరిగుట్టలో చాలామంది అతని దగ్గర చిట్టీలు వేశారు. అదే నమ్మకాన్ని ఆసరా చేసుకుని చిట్టీలు వేసిన తమను నిలువునా ముంచాడని బాధితులు ఆవేదన చెందుతున్నారు. ఇన్నేండ్లు నమ్మకంగా నటించిన ఉమాప్రభాకర్‌ రెడ్డి, ఇలా నట్టేట ముంచుతాడని ఊహించలేదని  బాధితులు కన్నీటి పర్యంతం అవుతున్నారు. చిట్టీలు వేసినవారిలో ఎక్కువ మంది మహిళలే ఉండటంతో, ఇదే అదనుగా భావించి భారీ మొత్తంలో నగదు వసూల్‌ చేసి చిట్టీల వ్యాపారి పరార్‌ అయ్యాడు. .చిట్టీల వ్యాపారమే కాకుండా అధిక వడ్డీ పేరుతో కొందరి నుంచి డబ్బులు కూడా వసూలు చేశాడని బాధితులు తెలిపారు. దానికి సంబంధించిన ప్రామిసరీ పత్రాలు కూడా చూపించారు బాధితులు. చిట్టీల డబ్బులు ఇవ్వాలని అతనిపై ఒత్తిడి తేవడంతో రేపు, మాపు అని చెప్పి దాదాపు ఆరు నెలలపాటు జరిపారని, తీరా చూస్తే వసూలు చేసిన డబ్బులతో పరార్‌ కావడంతో బాధితులు ఏం చేయాలో తోచక చిట్టీల వ్యాపారీ ఇంటిముందు ఆందోళనకు దిగారు. కూలీనాలి చేసి చిట్టీలు వేసిన మహిళలు, మోసపోయామని ఆలస్యంగా తెలుసుకుని కన్నీటిపర్యంతమయ్యారు. తమకు న్యాయం జరిగేలా చూడాలని స్థానికులను బాధితులు వేడుకుంటున్నారు.