20 తరువాత.. తెలంగాణ ఉరుముతది

– ఈలోపు రాష్ట్రం ఇవ్వకుంటే విశ్వరూపం చూపిస్తది
– ఎక్కడ వాత పెట్టాలో అక్కడ పెడుతం
– తెలంగాణ ఉద్యమ బిడ్డడు మన స్వామిగౌడ్‌
– కేకే, పొన్నంలది నిజమైన ఉద్యమం
– సిగ్నల్లు ఉద్యమ నేతలకిస్తరు.. లగడపాటిలాంటి దద్దమ్మలకు కాదు
– టీఎన్జీవోల నేత స్వామిగౌడ్‌ గౌరవార్థ సభలో కేసీఆర్‌

హైదరాబాద్‌, ఆగస్టు 4, (జనంసాక్షి) : ఈ నెల 20 లోపు తెలంగాణ రాష్ట్రాన్ని కేంద్రం ప్రకటించాలని, లేకుంటే ఆ తరువాత ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం ఉరు ముతదని టీఆర్‌ఎస్‌ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖ రరావు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు హెచ్చరికలు జారీ చేశారు. టీఎన్జీవోల మాజీ అధ్యక్షుడు స్వామి గౌడ్‌ పదవీ విరమణ అనంతరం ఆయన గౌరవార్థం రవీంద్రభారతిలో ఏర్పాటు చేసిన సభలో శనివారం ఆయన ఉద్వేగంగా ప్రసంగించారు. ఈ సందర్భం గా కేసీఆర్‌ మాట్లాడుతూ ప్రభుత్వాలకు 20 వరకు గడువు విధిస్తున్నామని, ఈలోగా తెలంగాణను ఇ వ్వాలని లేకుంటే ఉద్యమ విశ్వరూపాన్ని చూడాల్సి వస్తుందని ఆల్టిమేటం ఇచ్చారు. ఇంతకాలం కేసీఆర్‌ మౌనంగా ఉన్నాడని అందరూ భావిస్తున్నారని, కానీ, తాను మౌనంగా లేనని ఉద్యమ కార్యాచరణ ను రూపొందిస్తున్నానని వివరించారు. పన్నేండేళ్లుగా తెలంగాణ కొట్లాడుతున్న తమకు ఎవరికి ఎప్పుడు ఎక్కడ ఎట్ల వాత పెట్టాలో చాలా బాగా తెలుసని ఛలోక్తి విసిరారు. సన్మాన గ్రహీత స్వామిగౌడ్‌ను ఉద్దేశించి కేసీఆర్‌ మాట్లాడుతూ తెలంగాణ గడ్డపై పుట్టిన గొప్ప ఉద్యమ బిడ్డ స్వామిగౌడ్‌ అని ప్రశం సించారు. స్వామిగౌడ్‌ నాయకుడిగా తెలంగాణ ఉద్యమాన్ని నడిపించిన తీరు చరిత్రలో మైలురా యిగా నిలిచిపోతుందన్నారు.స్వామిగౌడ్‌ కేవలం తన పదవికి మాత్రమే విరమణ చేశారని, తెలంగాణ ప్రజలకు సేవ చేయడానికి కాదన్నారు. ఇప్పుడు ఆయనకు ఉద్యమంలో చురుగ్గా పాల్గొనేందుకు అవకాశం లభించిందని, స్వామిగౌడ్‌ను తమ పార్టీలోకి గర్వంగా ఆహ్వానిస్తున్నామని కేసీఆర్‌ వెల్లడించారు. తెలంగాణ వచ్చిన తర్వాత రాష్ట్ర క్యాబినేట్‌లో స్వామిగౌడ్‌ చేరాలని, ఆయన వల్ల తెలంగాణ ఉద్యోగుల సమస్యలన్నీ పరిష్కారం అవుతాయన్న నమ్మకం తనకుందన్నారు. ఉద్యోగులనుద్దేశించి మాట్లాడుతూ ప్రత్యేక రాష్ట్రం వస్తే ఉద్యోగులకు ప్రత్యేకమైన ఇంక్రిమెంట్లు ఉంటాయని, కేంద్ర ఉద్యోగులకు సమానంగా రాష్ట్ర ఉద్యోగుల వేతనాలుంటాయని వివరించారు. తెలంగాణ ఉద్యమ కార్యాచరణపై అందరం కలిసి ఆలోచించి నిర్ణయం తీసుకుంటామని కేసీఆర్‌ తెలిపారు. కేసీఆర్‌కు కేంద్రం నుంచి రాష్ట్ర ఏర్పాటుపై ఎలాంటిచ సంకేతాలు రాలేదని గతంలో విజయవాడ ఎంపీ లగడపాటిరాజ్‌గోపాల్‌రెడ్డిపై కేసీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ఏర్పాటు జరిగితే దానికి సంబంధించిన సంకేతాలు ముందుగా ఉద్యమ నేతలకే వస్తాయి గానీ, లగడపాటిలాంటి దద్దమ్మలకు కాదని ఆయన బెజవాడ ఎంపీకి చురకలంటించారు. కాంగ్రెస్‌ నాయకులు కే.కేశవరావు, కరీంనగర్‌ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ చేస్తున్నది నిజమైన తెలంగాణ ఉద్యమమని, వాళ్ల ఉద్యమ తీరును తాను పార్లమెంటులో ప్రత్యక్షంగా చూశానని కొనియాడారు. ఇలాంటి నిజమైన తెలంగాణవాదులకు ఎల్లప్పుడు తమ అండ ఉంటుందని కేసీఆర్‌ భరోసా ఇచ్చారు. అనంతరం మాట్లాడిన సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకుడు కే.కేశవరావు తెలంగాణ ఇస్తామని కాంగ్రెస్‌ ఇక్కడి ప్రజలను మోసం చేసిందని ఆరోపించారు. కాంగ్రెస్‌ అధిష్టానం తమ పార్టీ తెలంగాణ ప్రజాప్రతినిధులను చివరి వరకు రాష్ట్రం ఇస్తామని నమ్మించి, ధోకా చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. తనను కొందరు కేసీఆర్‌ ఏజెంట్‌ అని అంటున్నారని, అయినా కేసీఆర్‌తో మ్యాచ్‌ ఫిక్సింగ్‌ చేసుకున్నది తెలంగాణ రాష్ట్ర సాధన కోసమేనని కేకే ఆవేశంగా తెలిపారు. తెలంగాణ కోసం ఉద్యమిస్తున్న వారికి మద్దతు తెలిపితే అనవసర ఆరోపణలు చేయడం కొందరు పనిగా పెట్టుకున్నారని ఆయన మండిపడ్డారు. ఇప్పటికైనా అన్ని పార్టీలు తెలంగాణకు అనుకూల ప్రకటన చేయాలని, అలా చేస్తే 15 రోజుల్లో తెలంగాణ వస్తదని కేకే విజ్ఞప్తి చేశారు.