2009 ఎన్నికల హామీలపై దృష్టి సారించాలి

సూరజ్‌కుండ్‌ : 2009 ఎన్నికల హామీల అమలుపై మరింత దృష్టిసారించాలని కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ నేతలకు పిలుపునిచ్చారు. పార్టీ, ప్రభుత్వం మధ్య మరింత సమన్వయం ఉండాలని, ఇప్పటివరకు దృష్టి సారించని సమస్యలపై నేతలు మరింత శ్రద్ధ పెట్టాలని కోరారు. మంత్రులు సమర్థవంతంగా పనిచేసి, పార్టీ కార్యకర్తలకు మంత్రులుప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ఫలితాలే లక్ష్యంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్‌ పార్టీ మేధోమథన సదస్సు శుక్రవారం హర్యానాలోని సూరజ్‌కుండ్‌లో ప్రారంభం అయింది. ఈ సందర్భంగా సోనియాగాంధీ మాట్లాడుతూ 2014 ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో మంత్రులు, సీనియర్లు అందరినీ కలుపుకొని ముందుకు సాగాలని దిశానిర్దేశం చేశారు. ఎన్నికల మేనిఫెస్టోలోని అంశాలను తప్పనిసరిగా అమలు చేయాలని, మేనిఫెస్టోలో మిగిలిపోయిన హామీలపై తక్షణం దృష్టి సారించాలని, పార్టీ పటిష్టత కోసం ఆర్థిక వనరులను సైతం సమకూర్చుకోవాలని సోనియా సదస్సుకు హాజరైన నేతలనుద్దేశించి చెప్పారు. ప్రభుత్వ నిర్ణయాలు కొన్ని సందర్భాలలో పార్టీ కేడర్‌ను సంతృప్తి పరచడం లేదని, పార్టీ అవసరాలు, లక్ష్యాలతో సహా ప్రభుత్వ పరిమితులను సైతం పరిగణనలోకి తీసుకోవాలని తెలిపారు. యూపీఏ రెండోసారి అధికారంలోకి వచ్చాక ఇలాంటి సమావేశం ఏర్పాటు చేయడం ఇదే మొదటిసారి. పలు నిర్ణయాల ఫలితంగా దేశవ్యాప్తంగా ప్రభుత్వం, కాంగ్రెస్‌ పార్టీ గడ్డుపరిస్థితులను ఎదుర్కొంటుండడమే కాకుండా అవినీతి కుంభకోణాలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్న తరుణంలో ఈ చర్చాగోష్టి జరుగుతోంది. 2014 ఎన్నికలే లక్ష్యంగా హర్యానాలోని సూరజ్‌కుండ్‌లో మేధోమథన సదస్సు శుక్రవారం ఉదయం ప్రారంభమైంది. ప్రధాని మన్మోహన్‌సింగ్‌, యూపీఏ చైర్‌పర్సన్‌ సోనియాగాంధీ సహా 70 మంది సీనియర్లు ఈ సదస్సుకు హాజరయ్యారు. 35 మంది వర్కింగ్‌ కమిటీ సభ్యులు ఉన్నారు. మన రాష్ట్రం నుంచి కేంద్ర మంత్రులు పల్లంరాజు, కిషోర్‌ చంద్రదేవ్‌, జైపాల్‌రెడ్డి హాజరయ్యారు. లండన్‌ నుంచి తిరుగు ప్రయాణంలో ఉన్న చిరంజీవి ఆలస్యంగా సమావేశానికి హాజరుకానున్నారు.