2019లో నా భార్య పోటీ చేయదు

అఖిలేష్‌ యాదవ్‌ సంచలన ప్రకటన
బెంగళూరు, జూన్‌15(జ‌నం సాక్షి ) : సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్‌ యాదవ్‌ సంచలన ప్రకటన చేశారు. ప్రస్తుతం కనౌజ్‌ నియోజకవర్గం లోక్‌సభ ఎంపీగా ఉన్న తన భార్య డింపుల్‌ 2019 లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయరని ప్రకటించారు. తమ పార్టీ ఆశ్రితపక్షపాతానికి పాల్పడుతోందన్న ఆరోపణలను తిప్పికొట్టేందుకే తాము ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆయన చెప్పారు. బీజీపీ కూడా తమ తరహాలోనే చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు. కన్నౌజ్‌ నుంచి తాను పోటీచేస్తానని, పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్‌ యాదవ్‌ తిరిగి మెయిన్‌పురి, అజంగఢ్‌ పార్లమెంటరీ నియోజకవర్గల నుంచి పోటీ చేస్తారని అఖిలేష్‌ ప్రకటించారు. ఈ రెండు సీట్లలోనూ ములాయం గెలవడంతో మెయిన్‌పురి నియోజకవర్గాన్ని ఆయన వదులుకున్నారు. ఇటీవల వరకూ ములాయం ఫ్యామిలీకి చెందిన 12 మంది సభ్యలు పార్టీ తరఫున పార్లమెంటుకు, రాష్ట్ర అసెంబ్లీకి, జిల్లా పంచాయత్‌, కో-ఆపరేటివ్‌లకు ప్రాతినిధ్యం వహిస్తూ వచ్చారని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో అఖిలేష్‌ తాజా ప్రకటన సంచలనం సృష్టిస్తోంది.