ఈ నెలాఖరులోగా మన ఊరు – మన బడి అభివృద్ధి పనులను పూర్తి చేయాలి జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి

బోయినిపల్లి ,మార్చి 03 (జనంసాక్షి)
ఈ నెలాఖరులోగా మన ఊరు – మన బడి కార్యక్రమంలో భాగంగా చేపట్టిన అభివృద్ధి పనులను పూర్తి చేసేలా చూడాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆయన బోయినిపల్లి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించి, మన ఊరు – మన బడి కార్యక్రమంలో భాగంగా చేపడుతున్న అభివృద్ధి పనుల పురోగతిని క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. పాఠశాలలో 14 లక్షల రూపాయలతో చేపడుతున్న కాంపౌండ్ వాల్, డైనింగ్ హాల్, ఎలక్ట్రికల్ పనులు, ఫ్లోరింగ్, టాయిలెట్లు, ఇతర అభివృద్ధి పనుల నిర్మాణాల్లో వేగం పెంచాలన్నారు. ఈ నెలాఖరులోగా ఈ అభివృద్ధి పనులను పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.అంతకముందు కలెక్టర్ బోయినిపల్లి మండలం బూరుగుపల్లి గ్రామంలోని గ్రామ పంచాయితీ భవనంలో నిర్వహిస్తున్న కంటి వెలుగు క్యాంపును తనిఖీ చేశారు. ఎంతమందికి కంటి పరీక్షలు చేశారు అనే వివరాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. గురువారం సాయంత్రం వరకు 671 మందికి కంటి పరీక్షలు చేయగా, అందులో 168 మందికి రీడింగ్ అద్దాలు పంపిణీ చేయడం జరిగిందని, 73 మంది కోసం ప్రిస్క్రిప్షన్ అద్దాలకు రికమండ్ చేశామని వైద్యాధికారులు కలెక్టర్ కు వివరించారు. ట్యాబ్ ఎంట్రీ ప్రక్రియ పకడ్బందీగా, ఎలాంటి తప్పులు జరగకుండా చేయాలని కలెక్టర్ ఆదేశించారు. అద్దాలు పంపిణీ చేసే సమయంలో యాప్ లో అప్ లోడ్ చేయడానికి వీలుగా ఫోటోలు తీసుకోవాలని సూచించారు.
బూరుగుపల్లి గ్రామంలోని నర్సరీని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి క్షేత్ర స్థాయిలో సందర్శించారు. నర్సరీలో పెంచుతున్న మొక్కల వివరాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. చివరగా కలెక్టర్ బోయినిపల్లి గ్రామ పంచాయితీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నర్సరీనీ సందర్శించి, మొక్కల సంరక్షణ తీరును క్షేత్రస్థాయిలో పరిశీలించారు. వేసవి కాలం దృష్ట్యా మొక్కల సంరక్షణకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని, ప్రతీ మంగళవారం, శుక్రవారం మొక్కలకు నీటిని అందించాలని గ్రామ పంచాయితీ కార్యదర్శిని ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డా.సుమన్ మోహన్ రావు, జిల్లా విద్యాధికారి రమేష్ కుమార్, ఇరిగేషన్ డివిజన్ ఈఈ శ్రీనివాస్ రావు, కంటి వెలుగు ప్రోగ్రామ్ అధికారి డా.శ్రీరాములు, తహశీల్దార్ నరేష్, ఎంపీడీఓ రాజేందర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.