నేడే పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్రారంభం.. కృష్ణమ్మకు సీఎం కేసీఆర్ జలహారతి

రాష్ట్ర ఇంజినీరింగ్‌ చరిత్రలోనే మరో అపూర్వ ఘట్టానికి శ్రీకారం చుట్టబోతున్నారు. దశాబ్దాలుగా సాగునీటి కోసం కలలుగంటున్న పాలమూరు ఉమ్మడి జిల్లా ప్రజల చిరకాల వాంఛను ముఖ్యమంత్రి కేసీఆర్‌ సాకారం చేయబోతున్నారు. శనివారం నాగర్‌కర్నూల్‌ జిల్లా కొల్లాపూర్‌ మండలం నార్లాపూర్‌ వద్ద పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు. ఈ మేరకు ఇరిగేషన్‌ శాఖాధికారులు పోలీసు, రెవెన్యూ అధికారులు సీఎం పర్యటనకు భారీ ఏర్పాట్లు చేశారు. కొల్లాపూర్‌ పట్టణమంతా జెండాలు, ఫ్లెక్సీలతో గులాబీమయంగా మారింది. నాగర్‌కర్నూల్‌ జిల్లా కేంద్రంతోపాటు మహబూబ్‌నగర్‌, జడ్చర్ల, నాగర్‌కర్నూల్‌, అచ్చంపేట, కొల్లాపూర్‌, వనపర్తి నియోజకవర్గాల్లో మంత్రులు నిరంజన్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌, ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు భారీ ఎత్తున స్వాగత తోరణాలను ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి సభ కోసం వారం నుంచి ఉన్నతాధికారులు కొల్లాపూర్‌లోనే మకాం వేసి, ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.

ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాతోపాటు రంగారెడ్డి జిల్లాలోని 12.30 లక్షల ఎకరాలకు సాగు, తాగునీటిని అందించాలనే లక్ష్యంతో పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాని (పీఆర్‌ఎల్‌ఐఎస్‌)కి రూ.35 వేల కోట్ల అంచనా వ్యయంతో 2015లో తెలంగాణ సర్కారు శ్రీకారం చుట్టింది. మొదటి దశలో తాగునీరు, రెండో దశలో సాగునీటికి సంబంధించిన పనులను పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకొన్నది. అందులో భాగంగా ఇప్పటికే మొదటి దశలో చేపట్టిన తాగునీటి సరఫరాకు సంబంధించిన పనులను నాగర్‌కర్నూల్‌ జిల్లా శ్రీశైలం బ్యాక్‌ వాటర్‌ నుంచి మొత్తంగా 21 ప్యాకేజీలుగా విభజించగా.. కేపీ లక్ష్మీదేవిపల్లి మినహా ప్రస్తుతం 18 ప్యాకేజీల పనులను మాత్రమే ప్రభుత్వం చేపట్టింది. ప్రస్తుతం ఆయా ప్యాకేజీల పనులన్నీ దాదాపు తుదిదశకు చేరుకొన్నాయి. ఇక ప్రాజెక్టు ద్వారా నాగర్‌కర్నూల్‌, మహబూబ్‌నగర్‌, కొడంగల్‌, నారాయణపేట, మక్తల్‌, దేవరకద్ర, జడ్చర్ల, కల్వకుర్తి, అచ్చంపేట, పరిగి, వికారాబాద్‌, తాండూర్‌, చేవెళ్ల, షాద్‌నగర్‌, ఇబ్రహీంపట్నం, మహేశ్వరం, రాజేంద్రనగర్‌, దేవరకొండ, మునుగోడు నియోజకవర్గాల్లోని 70 మండలాల్లో 1,226 గ్రామాలకు తాగు, సాగునీరు అందనున్నది. ప్రాజెక్టు నీళ్లతో 1,546 నీటికుంటలు, చెరువులను నింపనున్నారు. ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాల మేరకు నీటి ఎత్తిపోతలను ప్రారంభించేందుకు అధికారయంత్రాంగం సన్నాహాలు చేసింది.

పండుగలా ‘పాలమూరు’ ప్రారంభోత్సవం

ఉమ్మడి పాలమూరు జిల్లాలోని బీఆర్‌ఎస్‌ నేతలు ‘పాలమూరు పండుగ’ పేరుతో కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. పంపింగ్‌ మోటర్లను సీఎం కేసీఆర్‌ ఆన్‌చేసి, కృష్ణా జలాలను దుంకించిన మరుక్షణం.. ఆ జలాలను కలశాలలో నింపుకొని ప్రతి ఊరిలోని ఆలయాల్లో ఉన్న దేవుళ్లకు జలాభిషేకం చేయనున్నారు. భారీ ఎత్తున జనసమీకరణ చేసేందుకు మంత్రులు, ఎమ్మెల్యేలు ఏర్పాట్లు చేశారు. మంత్రులు శ్రీనివాస్‌గౌడ్‌, నిరంజన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు బీరం హర్షవర్ధన్‌రెడ్డి, గువ్వల బాలరాజ్‌, మర్రి జనార్దన్‌రెడ్డితోపాటు కలెక్టర్‌, ఎస్పీ, ఇతర ఉన్నతాధికారులు మూడ్రోజుల నుంచి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఇరిగేషన్‌ సలహాదారు పెంటారెడ్డి, ఈఎన్‌సీ మురళీధర్‌రావు, నార్లాపూర్‌ వద్ద ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు.

నార్లాపూర్‌లో మహోజ్వల ఘట్టం

పాలమూరు మహోజ్వల ఘట్టానికి నార్లాపూర్‌ వేదిక కానున్నది. ప్రాజెక్టులో కీలకమైన మొదటి పంప్‌హౌస్‌, అంజనగిరి రిజర్వాయర్ల నిర్మాణం ఇప్పటికే పూర్తయింది. మోటర్ల బిగింపు కొనసాగుతుండగా.. ఇప్పటికే రెండు మోటర్లు నీటి ఎత్తిపోతలకు సిద్ధంగా ఉన్నాయి. ఇటీవలే మొదటి పంపు డ్రైరన్‌ను నిర్వహించగా విజయవంతమైంది. అందులో భాగంగా నేడు జలాల ఎత్తిపోతలు చేపట్టనున్నారు. సీఎం కేసీఆర్‌ నార్లాపూర్‌ పంప్‌హౌస్‌ వద్ద 145 మెగావాట్ల సామర్థ్యమున్న మోటర్లను ఆన్‌ చేసి, జలాల ఎత్తిపోతలను ప్రారంభించనున్నారు. అనంతరం అంజనగిరి రిజర్వాయర్‌లోకి చేరిన కృష్ణమ్మ జలాలకు ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. జలహారతి పట్టనున్నారు. అనంతరం కొల్లాపూర్‌లో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొని, ప్రసంగించనున్నారు.

నార్లాపూర్‌ టు కొల్లాపూర్‌ సభ

ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో నిర్మించిన పాలమూరు ఎత్తిపోతలను ప్రారంభించేందుకు శనివారం సీఎం కేసీఆర్‌ కొల్లాపూర్‌ మండలంలోని నార్లాపూర్‌కు చేరుకొంటారు. మంత్రులు నిరంజన్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌, ఎమ్మెల్యేలతో కలిసి పూజలు చేయనున్నారు. అనంతరం లిఫ్ట్‌లోని కంట్రోల్‌ రూమ్‌లోకి ప్రవేశించి, మహాబాహుబలి మోటర్లను ఆన్‌ చేస్తారు. అక్కడే సర్జ్‌పూల్‌, పంప్‌హౌస్‌ను పరిశీలించి, అక్కడి నుంచి నార్లాపూర్‌ రిజర్వాయర్‌ వద్దకు చేరుకొంటారు. రిజర్వాయర్‌ వద్ద డెలివరీ సిస్టర్న్స్‌ నుంచి వచ్చే కృష్ణా జలాలకు పూజలు చేసి, పుష్పాభిషేకం చేస్తారు. అనంతరం ఎత్తిపోతల పథకంలో భాగస్వాములైన ఇరిగేషన్‌ ఉన్నతాధికారులను అభినందించనున్నారు. అనంతరం ఉన్నతాధి కారులతో సమీక్ష సమావేశం ఏర్పాటు చేసి, మిగిలిన మూడు రిజర్వాయర్లకు నీటిని తరలించే ప్రక్రియను అడిగి తెలుసుకొంటారు. అనంతరం కొల్లాపూర్‌ సభా వేధిక వద్దకు చేరుకుంటారు.