19 నుంచి యూపీలో ఐఎఫ్ డబ్ల్యూజే సమావేశాలు

సికింద్రాబాద్ ఆర్ సి జనం సాక్షి సెప్టెంబర్ 18 దేశవ్యాప్తంగా జర్నలిస్టుల హక్కులు, సంక్షేమం కోసం పోరాడుతున్న ఇండియన్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్(ఐఎఫ్ డబ్ల్యూజే) 125వ జాతీయ వర్కింగ్ కమిటీ సమావేశాలు ఈనెల19వ తేదీ మంగళవారం నుంచి మూడు రోజుల పాటు ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని మధురలో జరుగుతున్నాయి.ఈ సమావేశాలకు తెలంగాణ నుంచి పలువురు వర్కింగ్ కమిటీ సభ్యులు సోమవారం ఉదయం హైదరాబాద్ నుంచి మథురకు బయలుదేరి వెళ్ళారు. ఐఎఫ్ డబ్ల్యూజే జాతీయ అధ్యక్షులు కె. విక్రమ్ రావు అధ్యక్షతన జరుగనున్న ఈ సమావేశాల్లో దేశంలోని అన్ని రాష్ట్రాలకు చెందిన ఐఎఫ్ డబ్ల్యూజే వర్కింగ్ కమిటీ సభ్యులు హాజరవుతారు.ఈ సమావేశాల్లో పాల్గొనేందుకు తెలంగాణ రాష్ట్రం నుంచి ఐఎఫ్ డబ్ల్యూజే జాతీయ కార్యదర్శి పులిపలుపుల ఆనందం,వర్కింగ్ కమిటీ సభ్యులు, తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు మామిడి సోమయ్య,ఉపాధ్యక్షుడు ఎల్లొయి ప్రభాకర్, కర్ణాటక రాష్ట్రానికి చెందిన ఐఎఫ్ డబ్ల్యూజే మహిళా కార్యదర్శి శాంతకుమారి, నాగరత్నం తదితరులు బయలుదేరి వెళ్లారు. ఈ సమావేశాల్లో భాగంగా వార్తా పత్రికలు,వార్తా సంస్థలకు చెందిన వివిధ సంఘాలతో ఏర్పడిన నేషనల్ కాన్ఫడరేషన్ సమావేశం జరుగుతుంది.ఇందులో ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్(ఐఎఫ్ డబ్ల్యూజే)తో పాటు ఫెడరేషన్ ఆఫ్ పీటీఐ ఎంప్లాయిస్ యూనియన్లు, నేషనల్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్స్(ఐ), ఐజేయూ, యూఎన్ ఐ ఎంప్లాయిస్ యూనియన్(ముంబాయి), ఆలిండియా న్యూస్ పేపర్ ఎంప్లాయిస్ యూనియన్స్(ఎన్ ఎఫ్ ఎన్ ఈ న్యూ ఢిల్లీ)ల ఆఫీస్ బేరర్లు పాల్గొంటారు. కాన్ఫెడరేషన్ ఛైర్మన్, పీటీఐ జార్ఖండ్ బ్యూరో చీఫ్ ఇంద్రకాంత్ దీక్షిత్ అధ్యక్షతన జరుగనున్న ఈ సమావేశాల్లో దేశంలో మీడియా రంగం, జర్నలిస్టులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలపై చర్చించి భవిష్యత్ కార్యచరణను రూపొందిస్తారు. పీటీఐ ఎంప్లాయిస్ యూనియన్ ల సమాఖ్య ప్రధాన కార్యదర్శి బలరాం దహియా,తమిళనాడు కు చెందిన నేషనల్ కాన్ఫడరేషన్ ప్రధాన కార్యదర్శి జి.భూపతి, ఐఎఫ్ డబ్ల్యూజే అధ్యక్షులు కె.విక్రమ్ రావు తదితరులు ప్రసంగిస్తారు.