చారిత్రాత్మక మహిళా బిల్లుకు అన్ని పార్టీలు మద్దతు తెలపాలి.
బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దిలీప్ ఆచారి

నాగర్ కర్నూల్ జిల్లా బ్యూరో,జనంసాక్షి:
కేంద్రంలోని బిజెపి ఆధ్వర్యంలో ఎన్డీఏ ప్రభుత్వం మంగళవారం పార్లమెంటులో ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో ప్రవేశ పెట్టిన మహిళా రిజర్వేషన్ బిల్లుకు అన్ని రాజకీయ పార్టీలు మద్దతునిచ్చి ఏకగ్రీవానికి సహకరించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దిలీప్ ఆచారి కోరారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ బిల్లుతో 15 సంవత్సరాల పాటు జరిగే మూడు ఎన్నికలలో 33 శాతం రిజర్వేషన్లను అమలు చేయడం ద్వారా 100శాతం మహిళా రిజర్వేషన్ అమలు సాధ్యమవుతుందని వివరించారు. పార్లమెంటు అసెంబ్లీ ఎన్నికలలో మహిళా రిజర్వేషన్లను అమలు చేయడం ద్వారా ప్రతి నియోజకవర్గం నుండి 15 సంవత్సరాలలో ఒకసారి మహిళలకు అవకాశం దక్కుతుందని వివరించారు. ప్రధాని నరేంద్ర మోడీ తీసుకువచ్చిన ఎన్నో సాహసోపేత నిర్ణయాలలో భాగస్వామ్యం కావాలని కోరారు.అదేవిధంగా ప్రధాని నరేంద్ర మోడీ జన్మదినాన్ని పురస్కరించు కొని ప్రకటించిన విశ్వకర్మ కౌసల్య పథకాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని ఈ పథకం ద్వారా 12 సాంప్రదాయ కుల వృత్తుల వారికి లబ్ధి చేకూరుతుందని వివరించారు. శిక్షణ సమయంలో వారికి 500 రూపాయలను శిక్షణ అనంతరం పరికరాలను కొనుగోలు చేసేందుకు 15 వేల రూపాయలను చెల్లించడం జరుగుతుందని మూడు లక్షల రూపాయల రుణాలను అందించడం జరుగుతుందని తెలిపారు.ఈ పథకానికి 13 వేల కోట్ల రూపాయల నిధులను ప్రభుత్వం కేటాయించడం జరిగిందని వివరించారు.ఈ సమావేశంలో సీనియర్ నాయకులు బుసిరెడ్డి సుధాకర్ రెడ్డి వివిధ మండలాల అధ్యక్షులు లోహిత్ రెడ్డి నరేంద్ర చారి భూషయ్య రాష్ట్ర నాయకులు నారాయణ చారి మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షులు జాకీర్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.