24,942 మంది పిల్లలకు కంటి సమస్యలు
ఖమ్మం, జనవరి 28 (): జిల్లాలో 24,942 మంది విద్యార్థులు కంటి సమస్యలతో బాధపడుతున్నారని జవహర్ బాల ఆరోగ్య రక్ష సమన్వయకర్త డాక్టర్ నిర్మల్‌కుమార్ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా జవహర్ బాల ఆరోగ్య రక్ష, రాజీవ్ విద్యామిషన్, జిల్లా అంధత్వ నివారణ సంస్థ సమన్వయంతో పాఠశాల విద్యార్థులకు ప్రాథమిక పరీక్షలు నిర్వహించామన్నారు. ఇప్పటికే 2,51,214 మంది విద్యార్థులకు కంటి పరీక్షలు పూర్తి కాగా 24,942 మంది విద్యార్థులు కంటి సమస్యలతో బాధపడుతున్నట్టు గుర్తించామని ఆయన తెలిపారు. నేత్ర వైద్య నిపుణులతో రెండవ దశ పరీక్షలు చేయించి కళ్లజోడ్లను పంపిణీ చేయనున్నట్లు వివరించారు. శస్త్ర చికిత్సలు అవసరమైన విద్యార్థులకు మూడవ దశలో పూర్తిచేస్తామని చెప్పారు. జిల్లావ్యాప్తంగా రెండో దశ కార్యక్రమం త్వరగా పూర్తవుతుందని ఆయన తెలిపారు.