27న ‘అక్రిడిటేషన్‌’పై సదస్సు

ఈనాడు, హైదరాబాద్‌: విశ్వవిద్యాలయాల ఉపకులపతులు, డీన్స్‌, ఇతర అధికారులతో ఉన్నత విద్యామండలి ఈ నెల 27న ప్రత్యేక సదస్సు ఏర్పాటుచేసింది. ఉన్నత విద్యను అందించే విద్యా సంస్థలన్నీ తప్పనిసరిగా అక్రిడిటేషన్‌ పొంది ఉండాలని యూజీసీ ప్రత్యేక చట్టాన్ని తీసుకొచ్చింది. ఇందుకు అనుగుణంగా తీసుకోవాల్సిన చర్యల్లో భాగంగా అక్రిడిటేషన్‌పై అవగాహన తీసుకురావటానికి ఈ సదస్సుకు ఏర్పాటు చేసినట్లు ఉన్నత విద్యామండలి అధ్యక్షుడు ప్రొఫ్‌సర్‌ జయప్రకాశ్‌రావు వెల్లడించారు. ఉన్నత, సాంకేతిక విద్యా రంగాల నిపుణులు ఈ సదస్సులో పాల్గొననున్నారు. యూజీసీ నిబంధనల ప్రకారం.. స్థాపితమై ఆరేళ్లు దాటిన విద్యాసంస్థలన్నీ తప్పనిసరిగా అక్రిడిటేషన్‌ హోదా పొందాలి. విద్యా ప్రమాణాలు పెరగటానికి ఇది అత్యవసరమని, దీనికి సిద్దంగా లేని కళాశాలలకు అనుబంధ గుర్తింపు మంజూరును నిలిపేయాలని ఉన్నత విద్యాశాఖ వర్గాలు యోచిస్తున్నాయి. ఉన్నత విద్యను అందించే సంస్థలు రాష్ట్రంలో రెండున్నర వేలు ఉండగా.. వీటిల్లో 105 వరకు మాత్రమే అక్రిడిటేషన్‌ హోదా పొందటం గమనార్హం.