27న జిల్లాకు రానున్న ముఖ్యమంత్రి

శ్రీకాకుళం, జూలై 22 : రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఈ నెల 27న జిల్లా పర్యటనకు రానున్న సందర్భంగా ఆయన పర్యటించే ప్రాంతాలను కలెక్టర్‌ సౌరభ్‌గౌర్‌, జాయింట్‌ కలెక్టర్‌ భాస్కర్‌లు ఆదివారం నాడు పర్యవేక్షించారు. 27న జరిగే ఇందిరమ్మబాట కార్యక్రమానికి ముఖ్యమంత్రి రానున్నట్టు వారు తెలిపారు. రణస్థలం మండలం నెలివాడ గ్రామ పరిధిలో ముఖ్యమంత్రి రాకకు హెలిపాడ్‌ను ఏర్పాటు చేశారు. కోష్ట గ్రామ సమీపంలోని పెద్ద చెరువులో ఉపాధి హామీ పనులు జరుగుతున్నందున అక్కడి ఉపాధి హామీ కార్మికులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటారని వారు తెలిపారు. ఈ సందర్భంగా హెలిపాడ్‌ వద్ద గట్టి చర్యలు తీసుకోవాలని రహదారులు, భవనాల శాఖ పర్యవేక్షక ఇంజనీరు సిహెచ్‌ సోమశేఖర్‌ను కలెక్టర్‌ ఆదేశించారు. తాళ్ళవలస గ్రామం వద్ద ఉపాధి పనులను వారు పరిశీలించారు. రాజీవ్‌ యువకిరణాల కార్యక్రమం ద్వారా లబ్ధిపొందిన వారితో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. అమదాలవలస మండలం అక్కులపేట ఎత్తిపోతల పథకాన్ని, బూర్జ మండలం పెదపేట విత్తన అభివృద్ధి క్షేత్రాన్ని వారు పరిశీలించారు. అక్కడి రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పాతపట్నం ప్రాంతంలో ముఖ్యమంత్రి నిర్వహించే కార్యక్రమాలను వారు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో అమదాలవలస శాసన సభ్యులు బొడ్డేపల్లి సత్యవతి, శాసన మండలి సభ్యులు విశ్వప్రసాదరావు, అదనపు జాయింట్‌ కలెక్టర్‌ ఆర్‌ఎస్‌ రాజ్‌కుమార్‌, అర్జున్‌, రాంబాబు తదితరులు పాల్గొన్నారు.