27న ములుగులో సమావేశం
ములుగు,ఆగస్ట్25(జనం సాక్షి): ఈ నెల 27న ములుగు పట్టణంలో నియోజకవర్గ స్థాయి ముఖ్యకార్యకర్తల, నాయకుల సమావేశం నిర్వహించనున్నట్లు ములుగు మార్కెట్ కమిటీ చైర్మన్ డాక్టర్ అజ్మీరా ప్రహ్లాద్ తెలిపారు. ఈ సమావేశానికి రాష్ట్ర గిరిజన పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి అజ్మీరా చందూలాల్ ముఖ్యఅతిథిగా హాజరుకానున్నట్లు తెలిపారు. హైదరాబాద్‌లో జరిగే ప్రగతి నివేదన సభను విజయవంతం చేసేందుకు నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న నాయకులతో మంత్రి పలు అంశాలపై చర్చిస్తారని పేర్కొన్నారు. సభకు నియోజకవర్గంలోని కార్యకర్తలు 25వేల మందితో భారీ జన సవిూకరణతో ప్రైవేట్ బస్సులు, కార్లు, డీసీఎంలలో బయలుదేరి వెళ్లాలని సూచించారు. సెప్టెంబర్ 2న హైదరాబాద్‌లోని కొంగరకలాన్‌లో నిర్వహించే టీఆర్‌ఎస్ పార్టీ ప్రగతి నివేదన బహిరంగ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి వాటిని అమలు చేస్తోందని అన్నారు. ప్రభుత్వ పాలనను చూసి ఓర్వలేని ప్రతిపక్ష పార్టీల నాయకులు రాజకీయంగా ఎదగలేమనే భయంతో గ్రామాల్లో తిరుగుతూ తప్పుడు ప్రచారాలను పనిగా పెట్టుకుంటున్నారని అన్నారు. గతంలో ఏళ్ల తరబడి అధికారంలో ఉన్న పార్టీలకు సాధ్యం కాని అభివృద్ధిని నాలుగున్నర ఏళ్లలో సీఎం కేసీఆర్ నేతృత్వంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేసి చూపించిందని వివరించారు.