3న రాజ్యసభకు జీఎస్టీ బిల్లు
– భాజాపా ఎంపీలకు విప్ జారీ
న్యూఢిల్లీ,ఆగస్టు 1(జనంసాక్షి):ఈ నెల 3న కేంద్ర ప్రభుత్వం జీఎస్‌టీ బిల్లును రాజ్యసభ ముందుకు తెచ్చేందుకు యోచిస్తున్నట్లు సమాచారం. జీఎస్‌టీ బిల్లుకు అడ్డంకులు తొలగిపోయాయని ఆర్థిక శాఖ వర్గాలు చెబుతున్న నేపథ్యంలో ఈ బిల్లు సభముందుకు తెచ్చేందుకు కేంద్రం సిద్ధమవుతోంది. ఈ అంశంపై బిజెపి ఇప్పటికే తన పార్టీ రాజ్యసభ సభ్యులకు విప్ జారీచేసింది. మరోవైపు కాంగ్రెస్ సహా వివిధ ప్రతిపక్షాల నేతలతో సంప్రదింపులు జరిపింది. వీరంతా బిల్లుకు సానకూలత వ్యక్తం చేసినట్లు సమాచారం. గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ బిల్లుకు ఎట్టకేలకు మోక్షం కలిగే సూచనలు కనిపిస్తున్నాయి. బిల్లును ఈనెల 3 వ తేదీన రాజ్యసభలో ప్రవేశపెట్టనున్నట్లు కేంద్రం ప్రకటించింది. దీనికి కాంగ్రెస్ కూడా అంగీకరించడంతో లైన్ క్లియరయ్యింది. నిజానికి బీజేపీ దీన్ని 2 నే ప్రవేశపెడదామనుకుంది. అయితే సోనియా వారణాశి పర్యటన కారణంగా కాంగ్రెస్ దీనికి అడ్డుచెప్పింది. చివరకు కేంద్రమే మనసు మార్చుకుని బుధవారం తెస్తోంది. మూడు రోజుల పాటు సభలోనే ఉండాల్సిందిగా బీజీపీ తన సభ్యులకు విప్ జారీ చేసింది. స్వాతంత్యం వచ్చిన తరువాత ఒక ప్రభుత్వం తెస్తున్న అతి పెద్ద పన్ను సంస్కరణల బిల్లు ఇది. ఇంతవరకూ ఉన్న సీఎస్టీ స్థానే దీన్ని తెచ్చారు. ఈ బిల్లును ఈ ఏడాది మే 6 న లోక్ సభ ఆమోదించింది. తరువాత రాజ్యసభకు రివ్యూ నిమిత్తం పంపించారు. బిల్లుకు రాజ్యాంగ సవరణ అవసరం కాబట్టి పెద్దల సభ అభిప్రాయం తప్పనిసరి. రాజ్యసభలో పూర్తి మెజారిటీ లేనందున బీజేపీ ఇన్నాళ్ళూ దీన్ని తెగించి ప్రవేశపెట్టలేకపోయింది. దాదాపుగా అన్ని ప్రధాన పార్టీలనూ ఒప్పించి చివరకు తెస్తోంది.