3 నుంచి విశాఖలో ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ

విశాఖపట్నం: విశాఖలో భారీ ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. జులై 3 నుంచి 12వ తేదీ వరకు జరిగే ఈ రిక్రూట్‌మెంట్ ర్యాలీని విశాఖ ఇందిరా ప్రియదర్శిని మున్సిపల్ కార్పొరేషన్ స్టేడియంలో నిర్వహించనున్నారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉభయగోదావరి, కృష్ణా జిల్లాలతో పాటు కేంద్ర పాలిత ప్రాంతమైన యానాం ప్రాంతానికి చెందిన అభ్యర్థుల కోసం ఈ ర్యాలీ నిర్వహిస్తున్నారు.

బుధవారం జిల్లా కలెక్టర్ యువరాజ్ అధ్యక్షతన  జరిగిన సమావేశంలో ర్యాలీ ఏర్పాట్ల కోసం ఆర్మీ ఉన్నతాధి కారులు సమావేశమై చర్చించారు. ర్యాలీలో పాల్గొనే అభ్యర్థులకు తగిన సౌకర్యాలు కల్పించేందుకు జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉందని కలెక్టర్ చెప్పారు.  నగరంలో మూడు ప్రాంతాల్లో యుద్ధ ట్యాంకులను శాశ్వత స్థాయిలో ప్రదర్శించేందుకు ఆర్మీ అధికారులు ఈసందర్భంగా సంసిద్ధత వ్యక్తం చేశారు.

గిరిజన ప్రాంత యువకులు పెద్ద ఎత్తున సాయుధ దళాల్లో ఉద్యోగాలు పొందేలా ఐటీడీఎ ఆధ్వరలో  పాడేరు, చింతపల్లి, అరకు తదితర ప్రాంతాల్లో ప్రత్యేక సదస్సులు నిర్వహించనున్నామన్నారు.