30ఏళ్లుగా ప్రకృతి సేవలో..


30
సాధారణంగా 8వ తరగతి విద్యార్థికి చదువుతోపాటు.. ఆటలాడుకోవడం.. స్నేహితులతో సరదాగా గడపడం మాత్రమే తెలిసి ఉంటుంది. కానీ.. ఓ విద్యార్థి మాత్రం ప్రకృతిపై ప్రేమను పెంచుకున్నాడు. చెట్లను నరికేస్తూ, పర్యావరణానికి హాని చేస్తున్న టింబర్‌ మాఫియాపై పోరాటం ప్రారంభించాడు. అందుకు ఎక్కడ చెట్లను ఎక్కువగా నరికేస్తున్నారో వివరిస్తూ పర్యావరణాన్ని రక్షించాలని, టింబర్‌ మాఫియాను కట్టడి చేయాలని పోలీసులకు, అటవీ అధికారులకు తెలిసేలా వాల్‌పోస్టర్లు అంటించాడు. ఇదంతా.. మూడు దశాబ్దాల క్రితం మాట. ఈ మూడు దశాబ్దాల్లో ప్రపంచమే మారిపోయింది. కానీ అతని మదిలోని ఆలోచన మాత్రం చెక్కు చెదర్లేదు.ముప్ఫై ఏళ్లుగా పర్యావరాణాన్ని పరిరక్షించేందుకు కృషి చేస్తూనే ఉన్నాడు. ఇప్పటి వరకు దాదాపు 3లక్షల మొక్కలు నాటి ప్రకృతిపై తనకున్న ప్రేమను చాటుకున్నాడు. అతనే.. తమిళనాడుకు చెందిన యోగనాథన్‌. ప్రస్తుతం బస్సు కండక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. కండక్టర్‌ ఉద్యోగం చేస్తున్నా పర్యావరణంపై తనకున్న ప్రేమ ఏమాత్రం తగ్గలేదు. ‘తమిళనాడు గ్రీన్‌ మూమెంట్‌’ ఆధ్వర్యంలో పర్యావరణాన్ని పరిరక్షించేందుకు కృషి చేస్తూనే ఉన్నాడు.

కండక్టర్‌ ఉద్యోగం చేస్తున్న యోగనాథన్‌కు సోమవారం సెలవుదినం. ఆ రోజు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పాఠశాలల్లో మొక్కల పెంపకం.. పర్యావరణం ప్రాముఖ్యత గురించి విద్యార్థులకు అవగాహన కల్పిస్తాడు. మొక్కలు నాటేలా ప్రోత్సహిస్తున్నాడు. ఇప్పటి వరకు తమిళనాడులోని 32 జిల్లాలో 3వేలకు పైగా పాఠశాలల్లో పర్యావరణానికి సంబంధించిన అవగాహన కార్యక్రమాలు చేపట్టాడు. ఇటీవల పర్యావరణ దినోత్సవం రోజున యోగనాథన్‌ పిలుపుమేరకు పలు పాఠశాలల్లో విద్యార్థులు మొక్కలు నాటారంటే ఎంతలా కృషి చేస్తున్నాడో అర్థం చేసుకోవచ్చు.

విద్యార్థులు నాటిన చెట్లకు వారి పేరునే పెట్టి చెట్లను సంరక్షించేలా ప్రోత్సహిస్తున్నాడు. బస్సు కండక్టర్‌గా చేరిన 17 ఏళ్లలో ఇప్పటి వరకు 40 సార్లు బదిలీ అయ్యాడు. అందుకు కారణం తరచూ సెలవులు పెట్టడమే. అయితే.. ఆ సెలవులు కూడా పర్యావరణంపై విద్యార్థుల్లో అవగాహన కలిగించేందుకు, మొక్కలను పెంచేందుకు వినియోగిస్తున్నట్లు చెబుతున్నాడు.

పర్యావరణాన్ని పరిరక్షించేందుకు యోగనాథన్‌ చేస్తున్న కృషికి జాతీయ స్థాయిలో బహుమతులు అందుకున్నాడు. ఉపరాష్ట్రపతి నుంచి ‘ఎకో వారియర్‌ అవార్డు’ను కూడా అందుకున్నాడు.