370 రద్దుకు వ్యతిరేక తీర్పు

` లద్దాఖ్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఎన్‌సీపీ కూటమి ఘనవిజయం
` బీజేపీకి షాక్‌.. కేవలం రెండుస్థానాలకే పరిమితం
` భారత్‌ జోడో యాత్రతో కాంగ్రెస్‌పై ప్రజలకు విశ్వాసం : రాహుల్‌గాంధీ
కార్గిల్‌(జనంసాక్షి):ఇటీవల కార్గిల్‌లో జరిగిన లద్దాఖ్‌ అటానమస్‌ హిల్‌ డెవలప్‌మెంట్‌ కౌన్సిల్‌ ఎన్నికల్లో భాజపాకు షాక్‌ తగలింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌` నేషనల్‌ కాన్ఫరెన్స్‌(ఎన్‌సీ) కూటమి ఘన విజయం సాధించింది.మొత్తం 26 సీట్లకు అక్టోబర్‌ 4న ఎన్నికలు నిర్వహించగా.. ఆదివారం ఉదయం ఓట్ల లెక్కింపు చేపట్టారు. ఇప్పటివరకు 21 స్థానాలకు ఓట్ల లెక్కింపు పూర్తవ్వగా.. కాంగ్రెస్‌` నేషనల్‌ కాన్ఫరెన్స్‌ కూటమి 18 స్థానాల్లో విజయం సాధించింది. వీటిలో 10 సీట్లు నేషనల్‌ కాన్ఫరెన్స్‌ దక్కించుకోగా.. కాంగ్రెస్‌ పార్టీ 8 చోట్ల గెలిచి సత్తా చాటింది. భాజపా కేవలం రెండు స్థానాలకే పరిమితమైపోయింది.2019లో ఆర్టికల్‌ 370 రద్దు చేసి లద్దాఖ్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా ఏర్పాటు చేసిన తర్వాత తొలిసారి నిర్వహించిన కీలక ఎన్నికలు ఇవే కావడం గమనార్హం. మొత్తం 26 సీట్లకు గాను 85మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. మరో ఐదు స్థానాల్లో ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది.పదేళ్ల తర్వాత లద్దాఖ్‌`కార్గిల్‌ అటానమస్‌ హిల్‌ డెవలప్‌మెంట్‌ కౌన్సిల్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ అద్భుతమైన విజయం సాధించిందని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ అన్నారు. ఈ మేరకు ఆయన ‘ఎక్స్‌’ (ట్విటర్‌)లో స్పందించారు. ఆర్టికల్‌ 370 రద్దు తర్వాత తొలిసారి జరిగిన ఈ ఎన్నికల్లో తమ ‘ఇండియా’ భాగస్వామి నేషనల్‌ కాన్ఫరెన్స్‌తో కలిసి అధిక సీట్లు సాధించినట్టు పేర్కొన్నారు. రాహుల్‌ గాంధీ నిర్వహించిన భారత్‌ జోడో యాత్ర కాంగ్రెస్‌పై ప్రజల్లో విశ్వాసం నింపిందన్నారు. ఎన్నికల్లో విజయం సాధించిన అభ్యర్థులందరికీ అభినందనలు తెలిపారు. ఈ విజయం లద్దాఖ్‌, కార్గిల్‌లలో నూతన ప్రజాస్వామ్యాన్ని తీసుకొస్తుందని విశ్వసిస్తున్నట్టు వేణుగోపాల్‌ విశ్వసిస్తున్నట్టు పేర్కొన్నారు.ఎన్నికల ఫలితాల్లో నేషనల్‌ కాన్ఫరెన్స్‌`కాంగ్రెస్‌ కూటమి విజయం సాధిండంతో ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ప్రజలు ఈ తీర్పు ఇచ్చినట్లుగా జమ్ముకశ్మీర్‌లోని రాజకీయ పార్టీలు పేర్కొన్నాయి.కాగా, రాష్ట్ర విభజన వల్ల తాము చాలా నష్టపోయినట్టు పోలింగ్‌ సందర్భంగా కార్గిల్‌ ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. జమ్ముకశ్మీర్‌ను తిరిగి విలీనం చేయడంతోపాటు రాష్ట్రహోదాను పునరుద్ధరించాలని డిమాండ్‌ చేశారు. ఎన్నికల ఫలితాల్లో ఎన్సీ`కాంగ్రెస్‌ కూటమి విజయంపై సంబరాలు జరుపుకున్నారు.