4 స్థానాల్లో తెరాస, ఒక స్థానంలో కాంగ్రెస్‌ విజయం

15921ైదరాబాద్‌: తెలంగాణలో జరిగిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెరాస హవా కొనసాగుతోంది. నల్గొండ జిల్లాలో మాత్రం కాంగ్రెస్‌ పట్టు
నిరూపించుకుంది. ఇప్పటి వరకు వెలువడిన ఫలితాలిలా ఉన్నాయి. ఖమ్మం, మహబూబ్‌నగర్‌, రంగారెడ్డిలో తెరాస అభ్యర్థులు విజయం సాధించారు.
నల్గొండలో కాంగ్రెస్‌ అభ్యర్థి రాజగోపాల్‌రెడ్డి గెలుపొందారు. ఇంకా మహబూబ్‌నగర్‌ జిల్లాలో ఒక స్థానానికి లెక్కింపు జరుగుతోంది.

ఖమ్మం ఎమ్మెల్సీ ఎన్నికలో తెరాస విజయం
ఖమ్మం: ఖమ్మంలో 31 ఓట్ల ఆధిక్యంతో తెరాస అభ్యర్థి బాలసాని లక్ష్మీనారాయణ విజయం సాధించారు. బుధవారం నిర్వహించిన కౌటింగ్‌లో మొదటి ప్రాధాన్యతలో 313 ఓట్లు రాగా రెండో ప్రాధాన్యతలో మరో 3 ఓట్లు జతకలిశాయి. దీంతో 31 ఓట్ల తేడాతో బాలసాని విజయం సాధించారు. సీపీఐ అభ్యర్థి పువ్వాడ నాగేశ్వరరావుకు మొదటి ప్రాధాన్యతలో 275 ఓట్లు రాగా రెండో ప్రాధాన్యతలో 10 ఓట్లు లభించాయి. దీంతో 285 ఓట్లు దక్కాయి. వైసీపీ అభ్యర్థి లింగాల కమల్‌రాజుకు మెదటి ప్రాధాన్యతలో 102 ఓట్లు రాగా రెండో ప్రాధాన్యతలో ఒక్క రాలేదు. అయితే ఇద్దరు స్వతంత్య్ర అభ్యర్థులకు నామినేషన్‌ దాఖలు సమయంలో బలపర్చిన 10 మంది సభ్యులు కూడా ఓటు వేయకపోవడం గమనార్హం. ఫలితంగా 31 ఓట్ల తేడాతో సీపీఐపై తెరాస అభ్యర్థి విజయం సాధించింది. తెరాస విజయంతో ఆపార్టీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు.

మహబూబ్‌నగర్‌లో తెరాస విజయం
మహబూబ్‌నగర్‌: మహబూబ్‌నగర్‌ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెరాస అభ్యర్థి కసిరెడ్డి నారాయణరెడ్డి విజయం సాధించారు. సమీప కాంగ్రెస్‌ అభ్యర్థి దామోదర్‌రెడ్డిపై 65 ఓట్ల ఆధిక్యంతో నారాయణరెడ్డి గెలుపొందారు. నారాయణరెడ్డికి 445, కాంగ్రెస్‌ అభ్యర్థి దామోదర్‌రెడ్డికి 380 ఓట్లు పోలయినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు.

నల్గొండలో కాంగ్రెస్‌ విజయం
హైదరాబాద్‌: నల్గొండ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి విజయం సాధించారు. రాజగోపాల్‌రెడ్డికి 642 ఓట్లు రాగా, తెరాస అభ్యర్థి తేరా చిన్నపురెడ్డికి 449 ఓట్లు పోలయ్యాయి. అధికార తెరాస అభ్యర్థి చిన్నపరెడ్డిపై కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి విజయం సాధించడంతో కాంగ్రెస్‌ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి.

రంగారెడ్డిలో 2 స్థానాలు తెరాస కైవసం
రంగారెడ్డి జిల్లాలో రెండు ఎమ్మెల్సీ స్థానాల్లో తెరాస విజయం సాధించింది. తెరాస అభ్యర్థులుగా బరిలో దిగిన నరేందర్‌రెడ్డి, శంభీపూర్‌రాజు గెలుపొందారు. తెరాస విజయంతో ఆపార్టీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి.