సమైక్య రాష్ట్రం కోసం సీమాంధ్ర ప్రజల్ని


గడ్డాలు పట్టి బతిలాడండి
నేతలకు టీజీ పిలుపు
హైదరాబాద్‌, జులై23 (జనంసాక్షి) :
సమైక్య రాష్ట్రం కోసం సీమాంధ్ర ప్రజలను గడ్డాలు పట్టి బతిమిలాడాలని మంత్రి టీజీ వెంకటేశ్‌ నేతలకు పిలుపునిచ్చారు. తెలంగాణపై నిర్ణయం తీసుకునే దిశగా కాంగ్రెస్‌ పార్టీ అధిష్టానం చర్యలను ముమ్మరం చేసిన నేపథ్యంలో ఇకనైనా సీమాంధ్ర నేతలు మేల్కొనాలని కోరారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. తామంతా సమైక్యాంధ్ర కోసం ఉద్యమిస్తున్నామని బీరాలు పలుకుతూనే ఆంధ్రప్రదేశ్‌ను కొనసాగించాడానికి చేయాల్సిన ఉద్యమంపై నేతలకు సలహాలు, సూచనలు ఇచ్చారు. రాష్ట్ర విభజనకు తాము పూర్తి వ్యతిరేకమని మంత్రి టీజీ వెంకటేష్‌ పునరుద్ఘాటించారు. సమైక్య రాష్ట్రం కోసం మరోమారు ఉద్యమిస్తామని అన్నారు. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా చేపట్టదలచిన కార్యాచరణపై బుధవారం  సాయంత్రం 4 గంటలకు సీమాంధ్ర మంత్రులంతా సమావేశమవుతున్నామని తెలిపారు. ఇందులో భవిష్యత్‌ కార్యాచరణ చర్చిస్తామని చెప్పారు. అనంతరం చలో ఢిల్లీ కార్యక్రమం చేపడతామన్నారు. కేంద్రంలోని మంత్రులందరినీ కలిసి సమన్వయ పరచి రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా పోరాడతామన్నారు. టీడీపీ, వైకాపా, తమ పంథా మార్చుకోవాలని సూచించారు. తెలంగాణ ఇచ్చినా, ఇబ్బంది లేదంటూ రాజకీయ పార్టీలన్నీ వ్యాఖ్యానించడం వల్లే ఇలాంటి పరిస్థితి ఎదురైందన్నారు. అయితే తెలంగాణ ఇస్తారన్న నమ్మకం లేదన్నారు. కేంద్రం ఇప్పటి వరకు దీనిపైఎలాంటి హావిూ ఇవ్వలేదన్నారు.