కాంగ్రెస్‌ మెడకు వాద్రా ఉచ్చు


న్యూఢిల్లీ, ఆగస్టు 10 (జనంసాక్షి) :
ఏఐసీసీ అధినేత్రి సోనియాగాంధీ అల్లుడు, ప్రియాంకగాంధీ భర్త రాబర్ట్‌ వద్రా భూముల వ్యవహారం కాంగ్రెస్‌ పార్టీ మెడకు చుట్టు కుంటోంది. ఉత్తరప్రదేశ్‌లో ఇసుక మాఫి యాపై ఉక్కుపాదం మోపిన యువ ఐఏఎస్‌ దుర్గాశక్తి నాగ్‌పాల్‌కు సోనియాగాంధీ అండ గా నిలవడం, ఆమె ప్రధానికి లేఖ రాయడం, దుర్గాశక్తి సస్పెన్షన్‌పై కేంద్ర ప్రభుత్వం యూపీ సర్కారును వివరణ అడిగిన దరిమిలా రాబర్ట్‌వాద్రా వ్యవహారం మళ్లీ రాజుకుం టోంది. హర్యానాలోని గుర్గావ్‌ వాద్రా జరిపిన భూమి కొనుగోళ్ల వ్యవహారం మళ్లీ మొదటికి వచ్చింది. గుర్గావ్‌లో 3.53 ఎకరాల భూమికి సంబంధించి వాద్రా నకిలీ ధ్రువీకరణ పత్రాలు సృష్టించారని, ఒక వాణిజ్య కాలనీ లైసెన్స్‌లో భారీ మొత్తాన్ని ముడుపులుగా పుచ్చుకున్నారని ఐఏఎస్‌ అధికారి అశోక్‌ఖేంకా హర్యానా ప్రభుత్వానికి అందజేసిన నివేదిక ఖేంకా నివేదిక ఇప్పుడు ప్రకంపనలు సృష్టిస్తోంది. జాతీయ మీడియా ఈ విషయమై ప్రచురించిన, ప్రసారం చేసిన కథనాలు కాంగ్రెస్‌ పార్టీని వేలెత్తి చూపించాయి. దుర్గాశక్తికి ఒక న్యాయం, ఖేంకాకు మరో న్యాయమా అని ప్రశ్నిస్తున్నాయి. వాద్రా భూ పందేరంపై సమగ్ర విచారణ జరిపించాలని ప్రతిపక్షాలు డిమాండ్‌ చేస్తున్నాయి.