ఏపీఎన్‌జీవోల సభ అడ్డుకుంటాం
తెలంగాణ ఏర్పాటు ఖాయం
భూములు కాపాడుకునేందుకే సమైక్య ఉద్యమం
టీ ఎంపీలు పొన్నం, మధుయాష్కీ
హైదరాబాద్, ఆగస్టు 21 (జనంసాక్షి) :
సమైక్యాంధ్ర ఉద్యమం పెట్టుబడిదారుల ఉద్యమమని తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ ఎంపీ పొన్నం ప్రభాకర్, మధుయాష్కీ విమర్శించారు. కొందరు పెట్టుబడిదారులే ఉద్యమాన్ని నడిపిస్తున్నారని ఆరోపించారు. తమ స్వార్థ ప్రయోజనాల కోసం ప్రజలను రెచ్చగొడుతున్నారని ధ్వజమెత్తారు. ఏపీ ఎన్జీవోల ఉద్యమం వెనుక ఎవరు ఉన్నారో తమకు తెలుసన్నారు. హైదరాబాద్‌లో సమైక్యాంధ్ర సభ పెడితే అడ్డుకుంటామన్నారు. ఎవరెన్ని చేసినా పది జిల్లాలతో కూడిన తెలంగాణ ఏర్పాటు ఖాయమన్నారు. తెలంగాణ ప్రక్రియ ఆగేది కాదని తేల్చిచెప్పారు. సీడబ్ల్యూసీ నిర్ణయాన్ని సీఎం కాదు.. ప్రధాని అయినా శిరసా వహించాల్సిందేనిన పేర్కొన్నారు. రాష్ట్రపతి పాలన, నాయకత్వ మార్పుకైనా అధిష్టానం, కేంద్రం వెనుకాడబోదన్నారు. రాష్ట్రంలోని తాజా పరిస్థితులపై కేంద్ర ఇంటెలిజెన్స్ వద్ద సమాచారం ఉందని చెప్పారు. పరిస్థితుల ఆధారంగా తదుపరి చర్యలు ఉంటాయన్నారు. తెలంగాణ జర్నలిస్టుల ఫోరం (టీజేఎఫ్) ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన ‘మీట్ ది ప్రెస్’లో తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు పొన్నం ప్రభాకర్, మధుయాష్కీ తదితరులు మాట్లాడారు. తెలంగాణపై రాజకీయ పార్టీలు నాటకాలాడడం దారుణమని మండిపడ్డారు. అఖిలపక్షంలో తెలంగాణకు అనుకూలమన్న టీడీపీ, వైఎస్సార్‌సీపీ యూ-టర్న్ తీసుకొని మరోమారు తెలంగాణ ప్రజలను వంచించాయని విమర్శించారు. రెండు ప్రాంతాలకు సమన్యాయం అంటూ దీక్ష చేస్తున్న వైఎస్ విజయమ్మ.. సమన్యాయం అంటే ఏమిటో చెప్పాలని ప్రశ్నించారు. సీమాంధ్ర ప్రజాప్రతినిధులు తెలంగాణ ప్రజలను రెచ్చగొట్టేలా వ్యవహరించొద్దని సూచించారు. తెలంగాణపై టీడీపీ, వైఎస్సార్‌సీపీ యూటర్న్ తీసుకోవడం బాధకరమన్నారు. సమన్యాయం అంటే ఏమిటో విజయమ్మ చెప్పాలని డిమాండ్ చేశారు. ఇన్ని రోజులు తెలంగాణ వనరులను, సంపదను దోచుకున్నామని ఆమె చెప్పకనే చెప్పారని మండిపడ్డారు. అందుకే ఇప్పుడు సమన్యాయం రాగం ఎత్తుకున్నారని విమర్శించారు. హైదరాబాద్ లేని తెలంగాణను ఇక్కడి ప్రజలు అంగీకరించబోరని స్పష్టం చేశారు. పది జిల్లాలతో కూడిన తెలంగాణ ఏర్పాటు ఖాయమని పొన్నం ధీమా వ్యక్తం చేశారు. కలిసుండలేమని తెలంగాణ ప్రజలు చెబుతుంటే.. సీమాంధ్ర నేతలు కలిసుండాలని ఎలా అంటారని ప్రశ్నించారు. సీమాంధ్రలో జాతీయనేతల విగ్రహాలు కూలగొడుతుంటే పోలీసులు ప్రేక్షపాత్ర వహిస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణపై సీడబ్ల్యూసీ తీర్మానం శిలాశాసనమని, కాదనుకున్న వారు పార్టీ నుంచి బయటకు వెళ్లిపోవచ్చని స్పష్టం చేశారు. సీమాంధ్రులు హైదరాబాద్ కోసమే సమైక్య ఉద్యమం చేస్తున్నారని మధుయాష్కీ మండిపడ్డారు. అణగారిని ప్రజల అభివృద్ధి కోసం సీమాంధ్ర పెట్టుబడిదారులు ఆలోచించడం లేదన్నారు. వారి స్వార్థ ప్రయోజనాల కోసమే ఉద్యమం చేయిస్తున్నారని విమర్శించారు. రెండు రాష్టాల్రు ఏర్పడతే ఇరు ప్రాంతాల ప్రజలు బాగుపడతారన్నారు. ఇరు ప్రాంతాల ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడం సరికాదన్నారు. తెలంగాణ ఆకాంక్ష అరవై ఏళ్ల నాటిదని, అది సాకారమయ్యే వేళ సీమాంధ్రులు అడ్డుపడొద్దని కోరారు. రాయల తెలంగాణ సహా హైదరాబాద్ కేంద్రపాలిత ప్రాంతం చేయడం లాంటి ప్రతిపాదనలు వేటినీ అంగీకరించబోమన్నారు. కొడుకున్న ముఖ్యమంత్రిని చేయడానికే విజయమ్మ దీక్ష అని ఎద్దేవా చేశారు. హైదరాబాద్‌లో ఏపీఎన్జీవోలు సమైక్యాంధ్ర సభ నిర్వహిస్తే అడ్డుకుంటామని యాష్కీ స్పష్టం చేశారు. ఏపీఎన్జీవోల ఉద్యమం వెనుక ఎవరు ఉన్నారో తమకు తెలుసని అన్నారు. ఏపీ ఎన్జీవోలను తామే ఆంటోనీ కమిటీ వద్దకు తీసుకెళ్తామని, విభజనపై వారికున్న అభ్యంతరాలను, అభిప్రాయాలను కమిటీకి చెప్పుకోవాలని సూచించారు.