మేడంతో భేటీ


తెలంగాణపై వెనక్కి పోకపోవచ్చు
యూటీ చేస్తే బాగుండు
చిరంజీవి దింపుడుకల్లం ఆశ
న్యూఢిల్లీ, ఆగస్టు 23 (జనంసాక్షి) :
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై కాంగ్రె స్‌ పార్టీ అధిష్టానం వెనక్కిపోకపో వచ్చని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవి తెలిపారు. శుక్రవారం పార్టీ అధినేత్రి సోనియా గాంధీతో భేటీ అయిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా చేస్తేనే జరుగుతుందని సోనియాగాంధీకి తెలియజేశానని  చిరంజీవి చెప్పారు. శుక్రవారం సాయంత్రం సోనియాగాంధీతో పాటు ఆమె రాజకీయ సలహాదారు అహ్మద్‌ పటేల్‌తోనూ భేటీ అయ్యారు. హైదరాబాద్‌లో అన్ని ప్రాంతాల ప్రజలు ఉన్నారని, విభజన నిర్ణయం ప్రకటించినప్పటి నుంచి వారంతా అభద్రతాభావానికి లోనయ్యారని సోనియాకు చెప్పారన్నారు. ఉద్యోగులు, ఇళ్లు కట్టుకుని నివసించేవారు ఆందోళన చెందుతున్నారన్నారు. వారందరికీ భరోసా ఇవ్వాలని సోనియాను కోరానన్నారు. తన అభిప్రాయం అడిగితే యూటీగా చేస్తే అందరికీ న్యాయం జరుగుతుందని చెప్పానన్నారు. హైదరాబాద్‌ 18 లక్షల ఎకరాల విస్తీర్ణంలో ఉందని, అన్ని ప్రాంతాల ప్రజలు ఆ నగరంతో అనుబంధం ఏర్పర్చుకున్నారని అన్నారు. చదువుల కోసం విద్యార్థులు, ఉద్యోగాల కోసం నిరుద్యోగులు ఎక్కడెక్కడి నుంచో వచ్చి హైదరాబాద్‌తో పెనవేసుకుపోయారన్నారు. ప్రస్తుతం రకరకాల వాదనలు వినవస్తుండడంతో వారందరూ ఆందోళన చెందుతున్నారని, వారికి ధైర్యం చెప్పాల్సిన బాధ్యత మనపైనే ఉందన్న విషయం సోనియాకు తెలియజేశానన్నారు. హైదరాబాద్‌లాంటి రాజధాని నగరాన్ని నిర్మించుకోవాలంటే కొన్ని తరాలు పడుతుందని అన్నారు. అలాగే, విభజనవల్ల రైతులు నష్టపోయే అవకాశం ఉంటుందని, ముఖ్యంగా సాగునీటికి ఇబ్బందులు పడే అవకాశం ఉంటుందని చెప్పానన్నారు. సాగునీరు అందక అనంతపురం జిల్లా రైతులు అవస్తలు పడుతారన్న విషయాన్ని చెప్పానన్నారు. శుక్రవారం లోక్‌సభలో ఎంపీలు సప్పెన్షన్‌కు గురవ్వడం బాధాకరమన్నారు. వారి సమస్యలు సమంజసమైనవేనని అన్నారు. హైదరాబాద్‌ను యూటీగా చేస్తారన్న నమ్మకం తనకు ఉందన్నారు. తాను సమైక్యవాదినేనని, ప్రజల పక్షాన పోరాడుతానని అన్నారు. అక్కడి ప్రజలకు మేలు జరుగుతుందనుకుంటే ఏ నిర్ణయమైనా తీసుకోవడానికి వెనకాడబోనని స్పష్టంచేశారు. అయితే, అన్ని పార్టీలు లేఖలు ఇచ్చాక, అఖిలపక్ష సమావేశాల్లో అభిప్రాయాలు చెప్పాక నిర్ణయం తీసుకున్నామని అధినేత్రి అన్నారన్నారు. అన్ని ప్రాంతాల ప్రజలకు న్యాయం చేస్తానని ఆమె హామీ ఇచ్చారని అన్నారు. విభజన విషయంలో కాంగ్రెస్‌ పార్టీ ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి పోతుందని తాను అనుకోవడం లేదని అన్నారు.