సీడబ్ల్యూసీ నిర్ణయం అమలు కోసం సభలు టీ మంత్రులు


హైదరాబాద్‌, ఆగస్టు 24 (జనంసాక్షి) :
కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ తెలంగాణపై అనుకూల ప్రకటన చేసిన నేపథ్యంలో తెలంగాణ వ్యాప్తంగా ఆ నిర్ణయం అమలు కోసం బహిరంగ సభలు నిర్వహించాలని ఈ ప్రాంత మంత్రులు నిర్వహించారు. ప్రత్యేక రాష్ట్రం తామే తీసుకువచ్చామని చెప్పి తెలంగాణలో పొలిటికల్‌ మైలేజ్‌ పొందాలని భావిస్తున్న కాంగ్రెస్‌ పార్టీ ప్రజాప్రతినిధులు ఈమేరకు పది జిల్లాల్లో సభల నిర్వహణకు సిద్ధమయ్యారు. రాష్ట్రం ఏర్పాటయ్యాక విభజనోత్సవ సభలు జరుపుతామని, ప్రస్తుతం కృతజ్ఞతా సభల పేరుతో సభలు నిర్వహించనున్నట్లు తెలంగాణ ప్రాంత మంత్రులు తెలిపారు. తెలంగాణ ఏర్పాటుకు సహకరించాలని సీమాంధ్ర ప్రజాప్రతినిధులకు విజ్ఞప్తి చేశారు. విభజనపై హైకమాండ్‌ మాటకు కట్టుబడి ఉంటామన్న నేతలు మాట నిలబెట్టుకోవాలని సూచించారు. తెలంగాణ ప్రాంత మంత్రులు శనివారం ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డితో సచివాలయంలో సమావేశమయ్యారు. రాష్ట్రంలోని తాజా పరిణామాలపై చర్చించారు. తెలంగాణ ఏర్పాటుకు అడ్డు పడొద్దని, రాష్ట్ర విభజనకు సహకరించాలని కోరారు. సీమాంధ్ర నేతలకు, ప్రజలను ఒప్పించే బాధ్యత తీసుకోవాలని, ఆందోళనలు తగ్గుముఖం పట్టించేందుకు చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా జానారెడ్డి తదితరులు సీఎం తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ఒక ప్రాంతానికి అనుకూలంగా వ్యవహరించడం సరికాదని, హైకమాండ్‌ నిర్ణయానికి విూరే కట్టుబడి ఉండకపోతే ఎలా? అని నిలదీసినట్లు  తెలిసింది. తాను తెలంగాణకు అడ్డుపడడం లేదని, విభజన వల్ల తలెత్తే పరిణామాలను వివరించానని సీఎం బదులివ్వగా, హైకమాండ్‌కు నివేదికలిచ్చిన విషయం వాస్తవం కాదా? టీ మంత్రులు మూకుమ్మడిగా నిలదీసినట్లు సమాచారం. దీంతో ఆయన మిన్నకుండిపోయారు. ముఖ్యమంత్రిగా హైకమాండ్‌ ఆదేశాలకు కట్టుబడి రాష్ట్ర విభజనకు సహకరించాలని స్పష్టం చేసిన మంత్రులు.. తెలంగాణ ఏర్పాటు చేస్తున్నందుకు కృతజ్ఞతగా బహిరంగ సభలు నిర్వహించనున్నట్లు సీఎం కిరణ్‌కు దృష్టికి తీసుకువచ్చారు. భేటీ ముగిసిన అనంతరం మంత్రులు మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ప్రక్రియ వేగవంతం చేయాలని సీఎంను కోరామన్నారు. హైకమాండ్‌ నిర్ణయానికి కట్టుబడి ఉంటామన్న సీమాంధ్ర నేతలు మాట నిలబెట్టుకోవాలని కోరారు. ఈ నెల 28న తెలంగాణ మంత్రులు సమావేశం కానున్నట్లు చెప్పారు. రాష్ట్రం ఏర్పాటయ్యాక విభజనోత్సవ సభలు జరుపుతామని, ఇప్పుడు కృతజ్ఞతా సభలు నిర్వహించనున్నట్లు తెలిపారు. అంతకు ముందు తెలంగాణ ప్రాంత మంత్రులు మంత్రి జానారెడ్డి చాంబర్‌లో తెలంగాణ మంత్రులు శనివారం మధ్యాహ్నం భేటీ అయ్యారు. మంత్రులు పొన్నాల లక్ష్మయ్య, బసవరాజు సారయ్య, డీకే అరుణ, సుదర్శన్‌రెడ్డి, సునీతాలక్ష్మారెడ్డి తదితరులు హాజరయ్యారు. రాష్ట్రంలో నెలకొన్న పరిణామాలు, హస్తినలో సీమాంధ్రలో లాబీయింగ్‌ తదితర అంశాలపై ఈ భేటీలో చర్చ జరిగింది. తెలంగాణ విజయోత్సవ సభలు నిర్వహించే అంశంపై వారు ప్రధానంగా చర్చించారు. తెలంగాణ జిల్లాల్లో కాంగ్రెస్‌ పార్టీ తరఫున బహిరంగ సభలు నిర్వహించాలని నిర్ణయించారు. 25న మహబూబ్‌నగర్‌లో, 28న నిజిమాబాద్‌ జిల్లా బోధన్‌లో కృతజ్ఞతా సభలు నిర్వహించాలని ప్రాథమికంగా నిర్ణయించినట్లు సమాచారం.