హైదరాబాద్‌పై మెలిక పెట్టకపోతే విలీనానికి ఓ.కే..


హైదరాబాద్‌, ఆగస్టు 25(జనంసాక్షి):
టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ఆదివారం నాడు ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. లోక్‌సభా సమావేశాల్లో పాల్గొనేందుకు ఢిల్లీ వెళ్లినట్లుగా టీఆర్‌ఎస్‌ కార్యాలయ వర్గాలు పైకి చెప్తున్నప్పటికీ కాంగ్రెస్‌ పెద్దల ఆహ్వానం మేరకే హస్తిన వెళ్ళినట్లు సమాచారం. జూలై 30న తెలంగాణపై సీడబ్ల్యూసీ నిర్ణయం ప్రకటించిన తరువాత రాష్ట్ర రాజకీయాలు వేడెక్కిన విషయం తెలిసిందే.. తెలంగాణ రాష్ట్ర సాధనే తమ ఏకైక ఎజెండా అని, తెలంగాణ ప్రకటించిన తరువాత కాంగ్రెస్‌ పార్టీలోకి విలీనం అవుతామని కేసీఆర్‌ గతంలో పలుమార్లు ప్రకటించారు. ఇటీవల మీట్‌ ది ప్రెస్‌ కార్యక్రమంలో కేసీఆర్‌ మాట్లాడుతూ విధివిధానాలు చర్చించిన తరువాతే విలీన అంశంపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. తెలంగాణ నిర్ణయం వెలువడిన తరువాత కేసీఆర్‌ మొదటిసారి ఢిల్లీ వెళ్లారు. హైదరాబాద్‌పై మెలిక పెట్టకుండా పది జిల్లాలతో కూడిన తెలంగాణ బిల్లు పార్లమెంటులో ప్రవేశపెడితే విలీనానికి ఒప్పుకునే అవకాశాలు మెండుగా ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. ఢిల్లీలో ఆంటోని కమిటీ ఓ వైపు నివేదిక సిద్ధం చేస్తున్న నేపథ్యంలో కేసీఆర్‌ ఢిల్లీ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. దీనికి తోడు కేంద్రం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఆహార భధ్రత బిల్లుకు అనుకూలంగా ఓటు వేయడం కోసం లోక్‌ సభ సమావేశాలకు రావలసిందిగా కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్‌ సింగ్‌ కూడా ఫోన్‌ ద్వారా చేసిన విజ్ఞప్తితో కేసీఆర్‌ కాలు బయట పెట్టారని సంబంధిత వర్గాల ద్వారా తెలిసింది. ఢిల్లీలో దిగ్విజయ్‌సింగ్‌, ఆహ్మద్‌పటేల్‌, ఆంటోని, కాంగ్రెస్‌ పెద్దలను కేసీఆర్‌ కలుసుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం సీమాంధ్ర జిల్లాల్లో కొనసాగుతున్న ఉద్యమం నేపథ్యంలో హైదారాబాద్‌, నగర హోదా. నదీ జలాలు, ఆదాయం పంపిణీ తదితర అంశాలపై చర్చించేందుకు కూడా కేసీఆర్‌ను పిలుస్తున్నట్లు తెలుస్తోంది. ప్రాథమిక చర్చలు కేసీఆర్‌తో జరిపిన తరువాత ఈ పర్యటనలో కాకపోయినా తరువాత అయినా సోనియాతో కేసీఆర్‌ భేటీ అయ్యే అవకాశాలు ఉన్నాయి.