హైదరాబాద్‌లో అశాంతికి కుట్ర దేవీప్రసాద్
కరీంనగర్, సెప్టెంబర్ 4 (జనంసాక్షి) :
హైదరాబాద్‌లో అశాంతికి సీఎం, డీజీపీలు కుట్రపన్ను తున్నారని టీఎన్‌జీవోస్ రాష్ట్ర అధ్యక్షుడు దేవీప్రసాద్ ఆరోపించారు. ప్రశాం తం గా ఉండి అన్నదమ్ముల్లా విడిపోయి ఆత్మీయుల్లా కలిసి ఉందామని తెలంగాణ ప్రజలు కోరుతుంటే సీమాంధ్రకు చెందిన నాయకులు మాత్రం కలిసి ఉండి కడుపులో బల్లెంగా తయారు కావాలని చూస్తున్నారని ఆయన పేర్కొన్నారు. కరీంనగర్‌లో ముల్కీ అమరవీరుల సంస్మరణార్థం నిర్వహించిన భారీ ర్యాలీ సందర్భంగా దేవిప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ హైదరాబాద్‌లో ఏపీఎన్జీఓల సభకు అనుమతివ్వడం అంటే ఇరు ప్రాంతాల మద్య మరింత విద్వేశాలను రెచ్చగొట్టడమే అవుతుందన్నారు. తెలంగాణ ప్రజలు శాంతియుతంగా ర్యాలీ నిర్వహించుకుని ముల్కి అమరులకు నివాళులర్పించుకునేందుకు అనుమతినివ్వకపోవడం దుర్మార్గం కాదా అని ప్రశ్నించారు. ఈర్యాలీకి టీ కాంగ్రెస్ మంత్రులే అనుమతులు ఇప్పించాలని దేవీప్రసాద్ డిమాండ్ చేశారు. ప్రభుత్వం అనుమతిచ్చినా ఇవ్వకపోయినా సరే తాము మాత్రం ర్యాలీలు నిర్వహించి కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు. పోలీసులు ఏవిధంగా అడ్డుకుంటారో కూడా చూసేందుకు సైతం తాము వెనుకాబడపోమన్నారు. తెగింపు అనేది తెలంగాణ వారికి కొత్తేమి కాదన్నారు. సీమాంధ్రలో జరుగుతున్నది ప్రజా ఉద్యమం కానేకాదన్నారు. సీఎం, డీజీపీలు వెనుకుండి నడిపిస్తున్నారని ఆరోపించారు. సీమాంధ్రలో తెలంగాణ ఉద్యోగులపై దాడులు జరుగుతున్నాయని, వారికి రక్షణ కల్పించకపోతే హైదరాబాద్‌కు బదిలీ చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గత 55 ఏళ్లుగా ఎన్నో సార్లు ఉద్యమాలు చేసిన చరిత్ర తెలంగాణవారిదన్నారు. హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతం అన్నా, కామన్ క్యాపిటల్ అన్నా కూడా ఊరుకోబోమన్నారు. సీమాంధ్రలో ఉద్యమానికి కిరణ్, డిజిపిలు నాయకులుగా వ్యవహరిస్తున్నారని దేవి ప్రసాద్ ఆరోపించారు. ఉద్యోగుల సమస్యలు పరిష్కరించుకునేందుకు తాము సిద్దంగా ఉన్నామని చెపుతున్నా కూడా ఏపిఎన్జీఓలు అనవసర రాద్దాంతం చేస్తుందని ఆరోపించారు.